
100 రోజుల ఎజండా
* కీలకమైన అంశాలను గుర్తించి లక్ష్యంలోగా పూర్తి చేయండి
* మంత్రులకు ప్రధాని మోడీ మార్గనిర్దేశం
* అభివృద్ధిలో రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పించాలి
* దేశాభివృద్ధికి పది సూత్రాల ప్రణాళిక
న్యూఢిల్లీ: ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మూడు రోజులకే తన మంత్రివర్గ సహచరులకు నరేంద్రమోడీ 100 రోజుల ఎజెండాను నిర్దేశించారు. తమ మంత్రిత్వశాఖల్లో ప్రాధాన్యతలవారీగా కీలకమైన అంశాలను గుర్తించి 100 రోజుల్లోగా వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. సమర్థ పాలనతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు సక్రమంగా అమలయ్యేందుకు పెద్దపీట వేయాలని సూచించారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యమే ముఖ్యమని చెబుతూ.. రాష్ట్రాలు, ఎంపీలు లేవనెత్తే సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్బోధించారు. గురువారమిక్కడ జరిగిన కేబినెట్ భేటీలో మోడీ ఈ మేరకు మార్గనిర్దేశం చేశారు.
దేశాభివృద్ధికి పది సూత్రాల ప్రణాళికలో భాగంగా ప్రధాని ఈ విషయాలను మంత్రులకు వివరించారు. ఈ పది సూత్రాల ప్రణాళికలో... దేశంలో పెట్టుబడులను గణనీయంగా పెంచడం, ఇప్పటికే చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయడం, దేశ పురోగతికి సహజ వనరులను వినియోగించుకోవడం వంటి అంశాలకు మోడీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్ 4 నుంచి 11 వరకు జరుగనున్న పార్లమెంట్ సమావేశాల అనంతరం మోడీ తన పది సూత్రాల ప్రణాళికను వివరిస్తూ జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశాలున్నాయి.
తొలి వంద రోజుల్లో మంత్రిత్వ శాఖల్లో ముఖ్యమైన అంశాలను గుర్తించి, వాటిని పూర్తి చేయాలని మోడీ చెప్పినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం అయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధరల నియంత్రణ, వ్యవసాయం, మహిళల భద్రతకు సహజంగానే పెద్దపీట వేస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
వడోదర సీటును వదులుకున్న మోడీ
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసితోపాటు గుజరాత్‌లోని వడోదర నుంచి నెగ్గిన మోడీ గురువారం వడోదర లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. వడోదరలో ఆయన కాంగ్రెస్ నేత మధుసూదన్ మిస్త్రీపై 5.7 లక్షల రికార్డు మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. చట్టం ప్రకారం రెండుస్థానాల్లో నెగ్గిన ఎంపీ.. ఫలితాలు వెలువడిన 14 రోజుల్లోపు ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాలి. ఈ గడువు గురువారంతో పూర్తికానున్న నేపథ్యంలో మోడీ వడోదర స్థానానికి రాజీనామా చేశారు. చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టినందుకు వడోదర నియోజకవర్గ ప్రజలకు ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి, ఆజాంగఢ్‌ల నుంచి నెగ్గిన ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ కూడా మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామాలు అందినట్లు పార్లమెంట్ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ రెండు చోట్ల ఉప ఎన్నికలు జరగనున్నాయి.
పీఎంవో అధికారులతో మాటామంతీ..
ప్రధానిగా మూడోరోజు నరేంద్రమోడీ సౌత్‌బ్లాక్‌లోని తన కార్యాలయంలో కలియదిరిగారు. స్వయంగా సిబ్బంది వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. కార్యాలయంలో పలు విభాగాలు, ఉద్యోగుల విధులు, వసతుల గురించి మోడీ వాకబు చేసినట్లు పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం సిబ్బంది, అధికారులతో కలిసి దిగిన ఫొటోను మోడీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
మోడీ 10 సూత్రాల ప్రణాళిక
1. పాలనలో పారదర్శకత, ఈ-వేలంకు పెద్దపీట
2. అధికారవర్గాల్లో విశ్వాసాన్ని పెంపొందించడం
3. అధికారుల నుంచి సృజనాత్మక ఆలోచనలను స్వీకరించడం, పనిలో స్వేచ్ఛ కల్పించడం
4. విద్య, ఆరోగ్యం, తాగునీరు, ఇంధనం, రోడ్లకు ప్రాధాన్యం
5. ప్రజా అనుకూల విధానాల రూపకల్పన
6. మౌలిక వసతులు, పెట్టుబడుల్లో సంస్కరణలు
7. శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక వ్యవస్థ
8. ఆర్థిక ఇబ్బందుల పరిష్కారానికి కృషి
9. నిర్దేశిత గడువులోగా విధానాల అమలు
10. ప్రభుత్వ విధానాల్లో సుస్థిరత
మంత్రులకు 7 మార్గదర్శకాలు
* కీలకాంశాలను గుర్తించి 100రోజుల్లో పరిష్కరించండి
* సుపరిపాలనపై దృష్టి పెట్టండి
* పథకాల అమలులో సమర్థంగా వ్యవహరించండి
*రాష్ట్రాలు, ఎంపీలు లేవనెత్తిన అంశాలపై తక్షణమే స్పందించండి. వాటిని పెండింగ్‌లో పెట్టొద్దు.
* గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న అంశాలను ప్రాధాన్యతలవారీగా చేపట్టండి
* నిర్ణయాల్లో సహాయ మంత్రులనూ విశ్వాసంలోకి తీసుకుని, వారికి కూడా పనులు అప్పగించండి
* సిబ్బంది నియామకాల్లో బంధుప్రీతి కూడదు