న్యూఢిల్లీ: రైజింగ్ ఇండియా అంటే ఆర్థిక వ్యవస్థ, జీడీపీ, విదేశీ పెట్టుబడులు మొదలైనవి మాత్రమే కాదని.. రైజింగ్ ఇండియా అంటే 125కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రజలు మద్దతుగా నిలుస్తున్నందునే కేంద్ర ప్రభుత్వం ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ‘న్యూస్ 18’ గ్రూప్ ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన సదస్సులో ప్రధాని ప్రసంగించారు. నోట్లరద్దు తర్వాత దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు పెరిగాయన్నారు.
తమ ప్రభుత్వ విజయాలతోపాటు రాబోయే కాలంలో తమ లక్ష్యాలను ఈ ప్రసంగంలో మోదీ వెల్లడించారు. ‘చాలా తక్కువ సమయంలోనే స్వచ్ఛభారత్ మిషన్ ఓ ప్రజా ఉద్యమంగా మారింది. ప్రజలు నగదురహిత లావాదేవీలను ఓ ఆయుధంగా మలుచుకున్నారు. ప్రజల మద్దతు కారణంగానే మా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోగలిగింది. ప్రజలు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా భారతదేశం ఓ సానుకూల మార్పు దిశగా వెళ్తోంది’ అని మోదీ పేర్కొన్నారు. ‘నేడు దేశవ్యాప్తంగా 13కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లున్నాయి. నాలుగేళ్లలో దేశంలో పారిశుద్ధ్య పరిధి 38 శాతం నుంచి 80 శాతానికి పెరిగింది’ అని మోదీ వెల్లడించారు.
ఉజ్వల జీవితానికి..: ‘ఉజ్వల పథకం ద్వారా పేదల వంటింట్లో వెలుగులతోపాటు కోట్ల కుటుంబాల్లో పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. భారత్ అభివృద్ధి చెందేందుకు అందరూ సమానమనే భావన రావాలి. అందుకే అసమానతలను రూపుమాపేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’ అని మోదీ అన్నారు. ‘యాక్ట్ ఈస్ట్, యాక్ట్ ఫాస్ట్’ అనేది తమ నినాదమని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం దృష్టిలో తూర్పు రాష్ట్రాలు అంటే ఈశాన్య రాష్ట్రాలతోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, ఇతర రాష్ట్రాలూ ఉన్నాయన్నారు. అస్సాంలో 31 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్యాస్ క్రాకర్ ప్రాజెక్టును తాము అధికారంలోకి రాగానే ప్రారంభించామన్నారు.
వైద్య సమస్యల పరిష్కారం: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి మెడికల్ సీట్లను గణనీయంగా పెంచాం. ప్రతి మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనుకుంటున్నాం. ప్రతి పంచాయతీని ఆరోగ్యంగా మార్చటం మా లక్ష్యం. మన తల్లులు, చెల్లెళ్ల ఆరోగ్యం కాపాడటం ప్రభుత్వ ప్రాధాన్యత’ అని ప్రధాని తెలిపారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా 3వేలకు పైగా పబ్లిక్ హెల్త్ క్లినిక్‌లు ప్రారంభమయ్యాయన్నారు. రూ. లక్షకోట్లతో విద్యారంగాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
నాడు కొరత.. నేడు మిగులు: ‘అంతకుముందు, పునరుత్పాదక విద్యుత్ విభాగానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందో తెలిసేది కాదు. దీని ద్వారా చాలా సమస్యలు తలెత్తేవి. కానీ ఆ పరిస్థితిని అధిగమించి నేడు మిగులు విద్యుత్‌తో దూసుకెళ్తున్నాం. ఒక దేశం–ఒక గ్రిడ్ స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా దూసుకెళ్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. ‘స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా దేశంలోని 18వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు.
మేం 16వేల గ్రామాలకు ఇప్పుడు వెలుగులు తీసుకొచ్చాం’ అని నరేంద్రమోదీ వెల్లడించారు. నాలుగేళ్లుగా భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాల కారణంగా ప్రపంచదేశాలపై భారత్ ప్రభావం పెరిగింది. యెమెన్‌లో సంక్షోభం తలెత్తినపుడు.. అక్కడున్న భారతీయులతోపాటు 48 దేశాల ప్రజలను మనం క్షేమంగా బయటకు తీసుకొచ్చాం.
ఆర్థిక వ్యవస్థపై..: ‘భారత్ తన సంకెళ్లను తెంచుకుని 21వ శతాబ్దంతో పోటీపడి ముందుకెళ్తోందని ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన భాగస్వామ్యం గతంతో పోలిస్తే ఏడురెట్లు పెరిగింది. ప్రపంచంలో ఎక్కడైనా భారత్ గురించి సానుకూలంగా చర్చిస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న తొలి రెండు దేశాల్లో మనం ఉన్నాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గతంలో సానుకూల వాతావరణం ఉండేది కాదు. కానీ కొన్ని నిబంధనలను సరళీకరించటంతో ఎఫ్‌డీఐల ప్రవాహం పెరిగింది’ అని ప్రధాని తెలిపారు.
క్షేత్రస్థాయికి పరిశోధనలు
ఇంఫాల్: ప్రజలకు మరింత మేలుకలిగేలా పరిశోధనల పరిధిని విస్తృతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రయోగశాలలనుంచి క్షేత్రస్థాయికి ఈ పరిశోధనలు మారాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)ని పునర్నిర్వచించి.. దేశాభివృద్ధికి ప్రయోగాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన అనంతరం శాస్త్రవేత్తలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. శాస్త్ర, సాంకేతికతను కనుగొనటం, వినియోగించటంలో భారత్‌కు సుదీర్ఘమైన చరిత్ర ఉందన్నారు.
ఫలితాలు సామాన్యుడికి అందేలా: సాంకేతికత ద్వారా విద్య, వైద్యం, బ్యాంకింగ్ తదితర రంగాల్లో పౌరులకు మరింత విస్తృతమైన సేవలందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ‘శాస్త్ర, సాంకేతికత ద్వారా ఇప్పటికీ చేరుకోలేని వర్గాలను చేరుకోవటం’ అనేది ఈసారి సైన్స్ కాంగ్రెస్ ఇతివృత్తం. ‘మన చిన్నారులకు ప్రయోగశాలనను అందుబాటులోకి తీసుకురావాలి. పాఠశాల విద్యార్థులతో శాస్త్రవేత్తలు తరచూ సంభాషించే వ్యవస్థను రూపొందించాలని కోరుతున్నాను. ఒక్కో శాస్త్రవేత్త.. ఏడాదిలో 100 గంటల సమయాన్ని కనీసం 100 మంది 9–12 తరగతుల విద్యార్థులతో గడిపి వారిని ప్రోత్సహించాలి’ అని ప్రధాని కోరారు. భారతీయ సైన్స్ కాంగ్రెస్ సభలకోసం ముందుగా నిర్ణయించుకున్నట్లుగా హైదరాబాద్ కాకుండా చివరి నిమిషంలో ఇంఫాల్‌కు మారటంతో డెలిగేట్ల సంఖ్య పలుచగా కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment