ఆ మహిళలకు సెల్యూట్‌ చేద్దాం!  | PM Modi Speaks About Lata Mangeshkar | Sakshi
Sakshi News home page

ఆ మహిళలకు సెల్యూట్‌ చేద్దాం! 

Published Mon, Sep 30 2019 3:43 AM | Last Updated on Mon, Sep 30 2019 8:33 AM

PM Modi Speaks About Lata Mangeshkar - Sakshi

న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపి, దేశం గర్వించేలా చేసిన మహిళలకు సముచిత గౌరవం, ప్రచారం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాల కోసం అవిశ్రాంత కృషి చేస్తున్న ఆ భరతమాత బిడ్డల విజయాలను గుర్తించి, ప్రశంసించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మాసాంతపు రేడియో ప్రసంగం కార్యక్రమం మన్‌ కీ బాత్‌లో ప్రధాని ఈ రోజు పలు అంశాలను పంచుకున్నారు. జాగింగ్‌ చేస్తున్న సమయంలో దార్లోని చెత్తను ఏరివేసే ప్లాగింగ్‌(జాగింగ్‌ ప్లస్‌ పికింగ్‌ అప్‌ లిటర్‌)ను ఉద్యమ స్థాయిలో చేపట్టాలని పిలుపునిచ్చారు. దీనికి ప్రచారం కల్పిస్తున్న రిపుదమన్‌ బెల్వీని మోదీ ప్రశంసించారు. విదేశాల్లో ప్లాగింగ్‌ సాధారణమే కానీ భారత్‌లో బెల్వీ దీనికి ప్రాచుర్యం కల్పించారని మోదీ తెలిపారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వాడకాన్ని అడ్డుకునే కార్యక్రమాన్ని అక్టోబర్‌ 2 వ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదేరోజు ‘ఫిట్‌ ఇండియా ప్లాగింగ్‌ రన్‌’ను క్రీడాశాఖ నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆరోగ్య పరిరక్షణ ముఖ్యమని, అందువల్ల ఈ – సిగరెట్ల వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని యువతను కోరారు. ఈ – సిగరెట్లు ఆరోగ్యానికి హానికరం కాదన్న దురభిప్రాయం ఉందని, అయితే, అది సరి కాదని, ఈ – సిగరెట్లు కూడా సాధారణ పొగాకు ఉత్పత్తుల మాదిరిగానే హానికరమని వివరించారు. ఈ కొత్త తరహా వ్యసనం బారిన యువత పడకూడదనే ఈ– సిగరెట్లను నిషేధించామన్నారు. అలాగే, సెప్టెంబర్‌ 28న జన్మదినోత్సవాన్ని జరుపుకున్న ప్రముఖ గాయని లత మంగేష్కర్‌కు శుభాకాంక్షలు చెబుతూ చేసిన ఫోన్‌కాల్‌ వివరాలను మోదీ తెలియజేశారు. దీపావళి సందర్భంగా మిఠాయిలు, బహుమతులను పేదలతో పంచుకోవాలని కోరారు.  మహిళా విజేతలను గౌరవించుకునే కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉందని ప్రధాని పేర్కొన్నారు.  ‘భారత్‌కీలక్ష్మి’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌మీడియాలో వారి గురించి ప్రచారం చేయాలన్నారు. ‘ఈ పండుగ సమయంలో బహుమతులు, మిఠాయిలు తీసుకోవడమే కాకుండా పంచుకోవడాన్ని ప్రారంభిద్దాం. మనకు పనికిరాని వస్తువులను అవసరమైన పేదలకు ఇద్దాం’ అని కోరారు. ఇటీవలి యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో స్టార్‌ ప్లేయర్‌ నదాల్‌ చేతిలో ఓటమి పాలైన రష్యా టెన్నిస్‌ ఆటగాడు డానిల్‌ మెద్వదేవ్‌ చూపిన క్రీడా స్ఫూర్తిని మోదీ కొనియాడారు.

లతకు శుభాకాంక్షలు..
అమెరికా పర్యటనకు వెళ్లే ముందే ప్రధాని మోదీ లతా మంగేష్కర్‌కు ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లతను తన సోదరిగా భావిస్తానన్నారు. ఆమెలోని నిరాడంబరత ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ‘మీ బర్త్‌డే రోజు నేను విమాన ప్రయాణంలో ఉండొచ్చు. అందువల్ల ముందే మీకు శుభాకాంక్షలు చెబుతున్నా. మీ ఆశీస్సులు మాకు కావాలి’ అని మోదీ కోరారు. అందుకు ప్రతిగా, ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన లత.. దేశానికి ఎంతో సేవ చేసిన మీ ఆశీస్సులే తనకు కావాలంటూ ప్రధానికి సమాధానమిచ్చారు. దానికి, ‘మీరు, వయసులోను, దేశానికి చేసిన సేవలోను ఎంతో పై ఎత్తున ఉన్నారు. మీ ఆశీస్సులే మాకు కావాలి’ అని మోదీ జవాబిచ్చారు. ‘ఈ సారి ముంబై వచ్చి నప్పుడు మీ ఇంటికి వచ్చి గుజరాతీ వంటకాలను ఆస్వాదిస్తా’ అని లతా మంగేష్కర్‌కు ప్రధాని చెప్పారు. లతా మంగేష్కర్‌ తల్లిగారైన శేవంతి మంగేష్కర్‌ గుజరాత్‌కు చెందినవారే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement