ప్రోటోకాల్‌ను పక్కన పెట్టిన ప్రధాని మోదీ
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకు స్వాగతం పలికేందుకు వెళ్లిన సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రోటోకాల్‌ను పక్కన పెట్టేశారు. సాధారణంగా ప్రధానమంత్రి కాన్వాయ్ వెళ్తోందంటే ఆ మార్గంలో ట్రాఫిక్ మొత్తాన్ని ఆపేస్తారు. దాదాపు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో కాన్వాయ్ ఉందనగానే పోలీసులు ఇతర వాహనాలన్నింటినీ ఆపేసి కాన్వాయ్ వెళ్లిన తర్వాత మాత్రమే అనుమతిస్తారు.
కానీ అలా నియంత్రణలు ఏవీ లేని మార్గంలోనే ప్రధానమంత్రి ప్రయాణించి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఒకరు భారతదేశంలో పర్యటిస్తున్నారు. షేక్ హసీనా నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. శనివారం నాడు ఆమె ప్రధాని మోదీతో విస్తృతస్థాయి చర్చలలో పాల్గొంటారు. సైనిక సాయం కోసం బంగ్లాదేశ్‌కు భారతదేశం దాదాపు 500 మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది.