
విపక్షాలు పారిపోయాయి: మోదీ
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అవినీతిని రూపుమాపేందుకు తాము ప్రయత్నిస్తుంటే పార్లమెంటులో చర్చ జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఆయన మండిపడ్డారు. సోమవారం ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా మోదీ మాట్లాడారు.
అవినీతి, నల్లడబ్బుపై జరగాల్సిన చర్చ నుంచి విపక్షాలు పారిపోయాయని, అవినీతి పరులకు అండగా నిలుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, నల్లడబ్బు అనే అంశాలు పేద మధ్య తరగతి కుటుంబాలను దారుణంగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ మనీపై ఈసీ తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నామని అన్నారు. పార్టీలకు వస్తున్న విరాళాల విషయంలో పారదర్శకతను పాటించడం ప్రతి రాజకీయ పార్టీ ఒక బాధ్యతగా తీసుకోవాలని కోరారు.