
సవరణ రాజ్యాంగ వ్యతిరేకం: జైపాల్
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతిరేకమని, ఆర్టికల్ 3 ప్రకారం వెళ్లకుండా పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయడం నిరంకుశత్వమని కేంద్రమాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. పునర్ వ్యవస్థీకరణ చట్టం తేవడం కోసం చేపట్టిన ప్రక్రియ గెజిట్ నోటిఫికేషన్‌తోనే పూర్తయ్యిందని, ఆ తరువాత తెచ్చిన ఈ సవరణ చెల్లదని శనివారం వ్యాఖ్యానించారు.‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని లోక్‌సభలో సవరించిన తీరు దురదృష్టకరం. ఆర్టికల్ 3, 4 కింద చేపట్టిన బిల్లు ప్రక్రియ పూర్తయ్యింది.
మళ్లీ సవరణ చేసే శక్తి ప్రభుత్వానికి గానీ, పార్లమెంటుకు గానీ లేదు. మళ్లీ ఆ ప్రక్రియను రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, 4 కిందనే ఆరంభించాలి. రాష్ట్రాల సరిహద్దులు మార్చేందుకు పార్లమెంటుకు సర్వాధికారం ఉంది. కానీ ప్రక్రియ పూర్తయిన తరువాత సవరణలు చేయడం రాజ్యాంగబద్ధం కాదు. తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా చేయడం రాజ్యాంగానికి వ్యతిరేకం. ఈ బిల్లును సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది’.
ముంపు గ్రామాలు వచ్చిన తర్వాత మళ్లీ మండలాలెందుకు ?
ముంపు గ్రామాలను మాత్రమే యూపీఏ సీమాంధ్రకు ఇచ్చింది. తాజా సవరణలో మండలాన్ని యూనిట్‌గా తీసుకున్నారు. కొన్ని గ్రామాలను ముంపునకు తీసుకుంటారట? మిగిలిన వాటిని నిర్వాసితుల పునరావాసానికి తీసుకుంటారట. ఇదేం న్యాయం?. రాజ్యసభలో తెచ్చి పాస్ చేయకముందే ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు.