దొంగతనానికి పాల్పడుతున్నాడనే అనుమానంతో పోలీసులు ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు.
న్యూఢిల్లీ: దొంగతనానికి పాల్పడుతున్నాడనే అనుమానంతో పోలీసులు ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు. గాయపడిన అతడిని ఆస్పత్రిలో చేర్పించి..ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం కూడా చేశారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆవ్యక్తి చనిపోయాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ప్రశాంత్ విహార్ ఏరియాలోని ఓ ఇంట్లో బుధవారం రాత్రి నితిన్ అలియాస్ సోను(24), సల్మాన్ అనే యువకులు దొంగతనానికి యత్నిస్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించారు. నిందితులను పోలీసులు పట్టుకోబోగా నితిన్ కాల్పులు జరిపాడు.
ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో నితిన్ కాలికి గాయాలు కావటంతో అక్కడే పడిపోయాడు. సల్మాన్ మాత్రం తప్పించుకుని పరారయ్యాడు. క్షతగాత్రుడిని పోలీసులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే తీవ్ర రక్తస్రావం కావటంతో నాలుగు యూనిట్ల రక్తం అవసరమైంది. దీంతో ఘటనలో పాల్గొన్న నలుగురు పోలీసులు రక్తదానం చేశారు. కానీ, సోను ప్రాణాలు విడిచాడని రోహితి ప్రాంత డీసీపీ రిషి తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా నిందితులపైకి కాల్పులు జరిపామని, మానవత్వం చూపి రక్తదానం చేశామని డీసీపీ వ్యాఖ్యానించారు.