
రాహుల్.. సర్వెంట్ గా పనిచేస్తున్నారా?
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ వదిలి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అద్దెకు ఉంటున్నారా?
ఘజియాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ వదిలి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అద్దెకు ఉంటున్నారా? ఒక ఇంట్లో సహాయకుడిగా పనిచేస్తున్నారా? అంటే కచ్చితంగా కాదనే చెప్పగలం. కానీ ఘజియాబాద్ ప్రాంతంలోని ఇందిరాపురానికి చెందిన ఒక వ్యక్తి తన ఇంట్లో రాహుల్ ఉంటూ తమకు హెల్పర్‌గా పనిచేస్తున్నాడని పోలీసుల వెరిఫికేషన్ ఫారమ్‌లో నింపి ఇచ్చాడు. దానిలో రాహుల్ గాంధీ ఫొటో కూడా అతికించి ఇచ్చాడు.
ఆ ఫారమ్‌పై రాహుల్ చిరునామాను ఇంటినంబర్ 12, తుగ్లక్ లేన్, న్యూఢిల్లీగా పేర్కొన్నాడు. వృత్తి అనే కాలమ్ వద్ద రాజకీయాలు అని, పెళ్లి వివరం వద్ద పెళ్లి కాలేదని రాశాడు. అయితే విశేషమేమిటంటే ఆ ఫారమ్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు స్టాంప్ వేసి ఆమోదించడం. ఇదంతా ఇందిరాపురం రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ పరిశీలనలో బయటపడింది. దీంతో ఉలిక్కపడ్డ పోలీసులు.. దీనిపై వివరణ ఇచ్చారు. ఇది ఎవరో ఆకతాయిగా చేసిన పనిలా ఉందని, ఆ వ్యక్తి నింపి ఇచ్చిన ఫారమ్ కూడా పాతదన్నారు.