
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో శాంతి స్థాపన కోసం మిలిటరీ కార్యకలాపాలు, రాజకీయ ప్రయత్నాలు సమన్వయంతో కొనసాగాలని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. పాక్ సైన్యం పట్ల మన సైనికులు మరింత దూకుడుగా వ్యవహరిస్తే సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితి మెరుగవ్వాలంటే జమ్మూకశ్మీర్‌లోని మన సైన్యం చేతులు ముడుచుకుని కూర్చోకుండా, కొత్త ఎత్తుగడలు, వ్యూహాలను రచించాల్సి ఉందని పీటీఐ ఇంటర్వ్యూలో రావత్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం స్థానికుల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి రాజకీయంగా చేయగలిగినదంతా చేయాలని సూచించారు.