
ప్రధాని మోదీపై రాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకుంటారని, ఏ అంశాన్నైనా చాలా నేర్పుగా పరిష్కరించగలరని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. ప్రధాని మోదీలోని అద్భుతమైన ఈ గుణం తనకు ఎంతగానో నచ్చిందని ఆయన కొనియాడారు. రాష్ట్రపతి ప్రణబ్ శుక్రవారం ఆయన ముంబైలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో ప్రసంగించారు. పార్లమెంట్ సమావేశాలను సమర్ధవంతంగా డీల్ చేయటంలో మోదీ ప్రతిభను గుర్తించానని చెప్పారు. కేవలం ఒక రాష్ట్ర పాలకునిగా మాత్రమే అనుభవం గడించిన మోదీ నేరుగా ప్రధానమంత్రిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టటం అపూర్వమన్నారు.
ప్రధాని హోదాలో జీ-20 దేశాల సమావేశాల్లోనూ చతురతతో వ్యవహరించి మోదీ అందరి ప్రశంసలు అందుకున్నారని.. ఆర్థిక వ్యవహారాలతో పాటు ఇతర దేశాలతో సత్సంబంధాల్లోనూ నేర్పరితనం చూపుతున్నారని ప్రశంసించారు. అయితే, విలువైన పార్లమెంట్ సమావేశాలు గొడవలతో వృథా కావటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతో అమూల్యమైన సమావేశాలను అనవసర విషయాలతో పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు పన్నుల రూపంలో అందజేసే డబ్బును ఖర్చు చేయటంపై చట్టసభలు అప్రమత్తంగా వ‍్యవహరించాల్సి ఉందని ప్రణబ్ సూచించారు.