ప్రత్యూష పిలుస్తోంది..
టీవీ నటి, బాలికా వధు ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఒకవైపు ఆమెది హత్యా ఆత్మహత్యా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ గందరగోళం ఇలా కొనసాగుతుండగానే మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రత్యూష మరణం తర్వాత అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాహుల్ తండ్రి వ్యాఖ్యలు సంచలనానికి దారితీశాయి. ప్రత్యూష తనను పిలుస్తోందంటూ తన కొడుకు రాహుల్ ఐసీయూలో కలవరిస్తున్నాడని చెప్పడం కలకలం రేపింది.
రాహుల్ ఆరోగ్యం పట్ల అతని తండ్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యూష చనిపోయిన తర్వాత తన కొడుకు ఇంకా షాక్ లోనే ఉన్నాడని, అతని మానసిక స్థితి బాగోలేదని తండ్రి మీడియాకు వివరించారు. రాహుల్ మానసిక స్థితి ఏ మాత్రం బాగోలేదన్నారు. రాహుల్‌ను చూసేందుకు ఐసీయూకు వెళ్లిన తనతో వింతగా ప్రవర్తించాడని, ప్రత్యూష తనను పిలుస్తోందని.. తాను వెళ్తానని ఐసీయూలో ఉన్న రాహుల్ చెబుతున్నట్లు అతడి తండ్రి పేర్కొన్నారు. దీంతో తమ కొడుకు ఏమైపోతాడోనన్న భయం తమను వెంటాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యూషను కోల్పోవడం ఆమె తల్లిదండ్రులకు బాధాకరమని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడంతో పాటు తన కొడుకు తొందరగా కోలుకోవాలని ప్రార్థించాలని వేడుకున్నారు. మరోవైపు ప్రత్యూష ఆత్మహత్యకు రాహుల్ బాధ్యుడంటూ వస్తున్న ఆరోపణలను అతడి బంధువులు తోసిపుచ్చారు.
ముంబైలోని నివాసంలో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఆమె మృతదేహంపై గాయాలు ఉండటం మరిన్ని సందేహాలకు తావిచ్చింది. దీంతోపాటు ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిపంద కాదని, ఆమెకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రత్యూష అనుమానాస్పద మరణంలో ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ను విచారించారు. అయితే ప్రత్యూషది హత్యా లేక ఆత్మహత్యా అనే విషయం మాత్రం ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉంది.