ప్రధాని కూడా జీతం పెంచుకోవాలి
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా జీతం సరిపోదని.. ఆయన కూడా తన జీతం పెంచుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాల పెంపుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్య చేశారు. ఈ జీతాలు పెంచిన తర్వాత కూడా ప్రముఖ మీడియాకు చెందిన ఎడిటర్లు, టాప్ టీవీ యాంకర్లు పొందేవాటిలో 120వ వంతు కూడా ఎమ్మెల్యేలకు రాదని కేజ్రీవాల్ అన్నారు. నెలకు లక్ష రూపాయల జీతం ఎందుకు సరికాదని, ఒకవేళ ప్రధాని జీతం దానికంటే తక్కువైతే ఆయన జీతం కూడా పెంచాల్సిందేనని చెప్పారు. ప్రధానమంత్రి జీతం పెంచాలని తామంతా డిమాండ్ చేస్తున్నామని కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
రేపు ఒబామాను కలిస్తే తన జీతం ఎంతని చెప్పుకొంటారని, అందుకే ప్రధాని జీతం నెలకు కనీసం రూ. 8-10 లక్షలు చేయాలని తెలిపారు. ఎమ్మెల్యేలకు తగినంత జీతం, ఇతర సౌకర్యాలు ఇవ్వాల్సిందేనని, అయినా వాళ్లు అవినీతికి పాల్పడితే మాత్రం వాళ్లను వదలకూడదని చెప్పారు.