
పార్లమెంట్ క్యాంటీన్‌లో ప్రధాని భోజనం
పార్లమెంట్ క్యాంటీన్‌లో సోమవారం అరుదైన ఉదంతం చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ క్యాంటీన్‌లో సోమవారం అరుదైన ఉదంతం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ అనూహ్యంగా ప్రత్యక్షమయ్యారు. కొంతమంది ఎంపీలతో కలసి భోంచేసి వారిని, క్యాంటీన్ సిబ్బందిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. శాకాహార భోజనం చేసి రూ. 29 చెల్లించారు. దాదాపు 25 నిమిషాల పాటు అక్కడ ఉన్నారు. ఈ క్యాంటీన్‌కు వచ్చిన తొలి ప్రధాని మోదీనే అని భావిస్తున్నారు. ఎంపీలకు ఉద్దేశించిన పార్లమెంట్ భవనం తొలి అంతస్తులోని 70వ నంబర్ గదిలో ఉన్న క్యాంటీన్‌కు మోదీ మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నారు. అప్పటికి రద్దీగా ఉన్న క్యాంటీన్‌లో దాదాపు 18 మంది ఎంపీలు చిన్న బృందాలుగా కూర్చుని భోంచేస్తున్నారు. ప్రధాని వారిని పలకరించారు. వారిలో కొందరు తమను ఆయనకు పరిచయం చేసుకున్నారు.
తర్వాత మోదీ ముగ్గురు ఎంపీలున్న టేబుల్ వద్ద కూర్చుని మంచి నీరు అడిగి, భోజనానికి ఆర్డర్ ఇచ్చారు. క్యాంటీన్ ఇన్‌చార్జి బీఎల్ పురోహిత్ ఆయనను ‘స్పెషల్ ఏమైనా కావాలా సర్?’ అని అడిగారు. అందుకు మోదీ, ‘ఏముంటే అది తీసుకురండి. ప్రత్యేకంగా ఏమీ అక్కర్లేదు(జో హై వహీ ఖిలాయియే..కుచ్‌భీ. అలగ్‌సే ఇంతెజామ్ కర్నేకీ జరూరత్ నహీ హై)’ అని చెప్పారు. తర్వాత ఫ్రూట్ సలాడ్‌కు ఆర్డర్ ఇచ్చారు. వెంటనే పాలక్ సబ్జీ, రాజ్మా, దాల్, అన్నం, రోటీ, పెరుగు, సలాడ్‌లను ప్రధానికి వడ్డించారు. ‘భోజనం బిల్లు రూ. 29 కాగా, ప్రధాని రూ. 100 నోటు ఇచ్చారు. రూ. 71 తిరిగి ఇచ్చా’ అని భోజనం వడ్డించిన వెయిటర్ రామశంకర్ తెలిపారు. ప్రధాని బాటిల్ నీరు అడగలేదని, అక్కడి మంచి నీరే తాగారని క్యాంటీన్ సిబ్బంది తెలిపారు. మోదీ టేబుల్ వద్ద కూర్చున్న ముగ్గురిలో ఇద్దరు గుజరాత్ ఎంపీలు ఉన్నారు.
కాసేపటి తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వారితో జత కలిశారు. మోదీ అక్కడి ఎంపీలతో కాసేపు ముచ్చటించారు. ప్రధాని రాక చరిత్రాత్మకమని భావించిన క్యాంటీన్ ఇన్‌చార్జి పురోహిత్ ఆయన అభిప్రాయం రాయాలని సలహా పుస్తకాన్ని అందించారు. మోదీ అందులో ‘అన్నదాతా, సుఖీభవ’ అని హిందీలో రాసి సంతకం చేశారు. దేశ ప్రధాని ఒకరు వినియోగదారుగా ఈ క్యాంటీన్‌లో భోంచేయడం ఇదే తొలిసారి అని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి.