
కల్తీ మద్యం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలన్న ప్రియాంక గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ : యూపీలో కల్తీ మద్యం సేవించి పలువురు మరణించిన ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ విషాద ఘటనకు బాధ్యులైన వారిపై కఠన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు యూపీ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రియాంక కోరారు.
కల్తీ మద్యం సేవించిన ఘటనలో మరణించిన కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. యూపీ, ఉత్తరాఖండ్‌లో కల్తీ మద్యం ఏరులై పారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ మద్యంతో వందకు పైగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. మరోవైపు కల్తీ మద్యం ఘటనపై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ యోగి సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ తోడ్పాటు లేనిదే కల్తీ మద్యం వ్యాపారం ఈస్దాయిలో జరగదని మండిపడ్డారు. యూపీలోని సహరన్‌పూర్, ఖుషీనగర్ జిల్లాలతో పాటు ఉత్తరాఖండ్‌లో కల్తీ మద్యం సేవించి ఇటీవల పలువురు మరణించిన సంగతి తెలిసిందే.