కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై నిరసన
సాక్షి, ముంబై : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై ముంబైలో పెను దుమారం లేచింది. ఎన్సీపీ ముంబై మహిళా శాఖ ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో నిర్భయ సంఘటన ఓ చిన్నదని, దీన్ని ప్రపంచమంతా ప్రచారం చేయడం వల్ల పర్యాటక రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను ఎన్సీపీ ముంబై మహిళ శాఖ అధ్యక్షురాలు చిత్ర వాఘ్ తీవ్రంగా ఖండించారు. అరుణ్ జైట్లీ వెంటనే రాజీనామా చేయడంతోపాటు మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మెట్రో థియేటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆజాద్‌మైదానం వరకు కొనసాగింది. ‘నేను అరుణ్ జైట్లీని’ అనే బోర్డు తగిలించి ఉన్న ఎద్దును ర్యాలీ ముందు భాగంలో నడిపించారు. అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా మహిళా కార్యకర్తలు నినాదాలు చేశారు. మహిళల గౌరవం కంటే పర్యాటక రంగం గొప్పదా..? అరుణ్ జైట్లీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. మహిళపై జరుగుతున్న అత్యాచారాలను మంత్రి చులకనగా మాట్లాడడం తగదని హితవుపలికారు. మహిళలపై న రేంద్ర మోడీ ప్రభుత్వం వైఖరి ఏమిటో జైట్లీ వ్యాఖ్యలతో స్పష్టమైందని చెప్పారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు, యువతులు పాల్గొన్నారు.