ముంబై: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు మిశ్రమ స్పందన లభిస్తోంది. బీజేపీ మిత్రపక్షం శివసేన బడ్జెట్‌ను స్వాగతిస్తుండగా, కాంగ్రెస్ ఎన్సీపీలు ‘ఆశలు చూపించారు కానీ కేటాయింపులు మాత్రం లేవు’ అని విమర్శిస్తున్నారు. బడ్జెట్ వివరాల్లోకెళితే..గత 2014 జులైలో అరుణ్ జైట్లీ తొలిసారి బడె ్జట్ ప్రవేశ పెట్టారు. అప్పుడు పుణేలో ‘ఎఫ్‌టిఐఐ’కు జాతీయ హోదా, విదర్భలో ఏయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు, ఐఐఎం స్థాపించడంతోపాటు పారిశ్రామిక కారిడార్ల ప్రధాన కార్యాలయం పుణేలో స్థాపించనున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో మూడు ఔషధ సంస్థలను నిర్మించే ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ ప్రకటించారు.సేవలు ఇక ప్రియం కానున్నాయని సేవా పన్ను పెంచడం ద్వారా పరోక్షంగా మంత్రి తెలిపారు. ముంబైలోని ఎలిఫెంటా గుహల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని మంత్రి చెప్పారు. ఇది పర్యాటక రంగ అభివృద్ధికి తోడ్పడుతుంది. రాష్ట్రంలో నేషనల్ మీడియా ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తామని, ఢిల్లీ ముంబై పారిశ్రామిక కారిడార్ కోసం రూ. 1200 కోట్ల నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇది ప్రగతిశీల బడ్జెట్: సీఎం ఫడ్నవీస్
అరుణ్ జైట్లీ ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అభివర్ణించారు. పేదలు, రైతులు, విద్యార్థులు, యువత, వృద్ధులతో సహా సమాజంలోని అన్నివర్గాల వారికి ఊరటనిచ్చేలా బడ్జెట్ ఉందని ఆయన పేర్కొన్నారు. కొత్తగా పెన్షన్ పథకాన్ని ప్రకటించి ప్రజలకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్రం అడుగులేస్తోందని చెప్పారు. విద్యార్థుల ఉన్నత విద్యకు భారీ ఎత్తున నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలతో పాటు ఇతరాల కోసం ఏకంగా రూ. 70 వేల కోట్లను కేటాయించారని, ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని అన్నారు. రోడ్లు, రైళ్లు, వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించడంతో అనేక అభివృద్ధి పనులు త్వరిత గతిన పూర్తవుతాయని అన్నారు. అనేక మందికి ఉపాధి కూడా లభించనుందని చెప్పారు.
స్వాగతించిన శివసేన
జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను శివసేన స్వాగతించింది. కొన్ని రోజులుగా బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న శివసేన బడ్జెట్ అందరికి అనుకూలంగా ఉందని అభివర్ణించింది. అందరి సంక్షేమంతోపాటు అభివృద్ధికి బాటలు వేసేలా ఉందని పేర్కొంది.
దళితులకు న్యాయం: రామ్‌దాస్ ఆఠవలే
దళితులకు న్యాయం జరిగేలా బడ్జెట్ రూపొందించారని ఆర్‌పీఐ అధ్యక్షుడు రామ్‌దాస్ ఆఠవలే పేర్కొన్నారు. సేవా పన్ను పెంచినప్పటికీ దీనివల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం ఉండ బోదన్నారు. అన్ని వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్ రూపొందించారని చెప్పారు.
పేదరిక నిర్మూలన కాదు, పేదల నిర్మూలన: నవాబ్ మాలిక్
జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మల్లిక్ పేర్కొన్నారు. పేదరికం నిర్మూలన కోసం కాకుండా పేదల నిర్మూలించే బడ్జెట్‌గా ఉందని దుయ్యబట్టారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉందని, సామాన్య ప్రజలకు అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. ఉద్యోగస్తులకు పన్నుల్లో రాయితీ ఇవ్వకుండా నిరాశ పరిచారని పేర్కొన్నారు.