
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు నేలరాలారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున పుల్వామా జిల్లా కేంద్రంలోని సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంలోకి చొరబడిన ఉగ్రవాదులు.. గ్రెనేడ్లు, తుపాకి కాల్పులతో బీభత్సం సృష్టించారు. గంటలపాటు కొనసాగిన కౌంటర్ ఆపరేషన్‌లో చివరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
సుదీర్ఘ ఆపరేషన్ : తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో పుల్వామా జిల్లా కేంద్రంలోని 185వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు.. తొలుత గ్రెనేడ్లు విసిరి బీభత్సం సృష్టించే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు చేశారు. వెంటనే తేరుకున్న భారత బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. క్యాంప్‌లోని ఓ బిల్డింగ్‌లో నక్కిన ఉగ్రవాదులు దొంగచాటుగా కాల్పులు జరిపారు. గంటలపాటు సాగిన ఆపరేషన్‌లో చివరికి ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.