
ఛండీగర్ : పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు రద్దు చేస్తూ పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిగతా తరగతుల మాదిరిగానే పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తామని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. ప్రీ బోర్డ్ పరీక్షల ఫలితాల ఆధారంగా వారిని పై తరగతులకు పంపిస్తామని వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. (ఇకపై మద్యం హోం డెలివరీ..ఇవిగో టైమింగ్స్ )
ప్రతి ఏడాది దాదాపు 4 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. అయితే కరోనా కారణంగా పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఎగ్జామ్స్‌ని రద్దు చేస్తూ పై తరగతులకు పంపాలని నిర్ణయించారు. ఇప్పటికే 5 నుంచి 8 సహా వివిధ తరగతుల విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఇటీవల ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. దేశంలోనే మొదటిసారి విద్యార్థులకు వేసవి సెలవులను ప్రకటించిన మొదటి రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. కాగా ఇప్పటివరకు పంజాబ్‌లో 1,731 కరోనా కేసులు నమోదవగా, 29 మంది మరణించారు.