
పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఊరట
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరటలభించింది.
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరటలభించింది. ఈ కేసులో తదుపరి చర్యలపై న్యాయస్థానం స్టే విధించిం ది. మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్సే కారణమంటూ రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్రలోని భీవండి మేజిస్ట్రియల్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదైంది. తదుపరి విచారణ వరకు ఈ కేసులో ప్రొసీడింగ్స్‌ను నిలుపుదల చేస్తున్నట్లు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ పీసీ పంత్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది.
దీనిపై నాలుగు వారాల్లో స్పందన తెలపాల్సిందిగా రాహుల్‌పై కేసు దాఖలు చేసిన ఆరెస్సెస్ కార్యకర్త రాజేశ్ కుంతేతోపాటు కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. అలాగే క్రిమినల్ పరువు నష్టం కేసుకు సంబంధించి ఐపీసీలోని సెక్షన్ 499, 500ల రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ రాహుల్ వేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది.