జాట్ పవర్ కనిపించేనా ?
తమ వాడు సీఎం కావాలన్న కోరిక తీరేనా?
రాజస్థాన్ ఎన్నికల ముఖచిత్రం
రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం సీట్లు : 200
జనరల్‌కు కేటాయించినవి:143
ఎస్సీ: 33, ఎస్టీ : 24
జైపూర్: రాజస్థాన్ రాజకీయాల్లో మొదట్నుంచీ కుల సమీకరణాలదే ప్రధాన పాత్ర. పాలనాపరమైన అంశాల కన్నా కులం, వర్గం రాజస్థాన్ రాజకీయాలను శాసిస్తుంటాయి. డిసెంబర్ 1న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ అవే ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి. అక్కడి రాజకీయాల్లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాజ్‌పుత్‌లు, జాట్ వర్గీయులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాచరిక నేపథ్యం మొదట్లో రాజ్‌పుత్‌లను అందలం ఎక్కించగా, ప్రస్తుతం బలహీన వర్గాల ప్రతినిధిగా జాట్ వర్గం ముందుకు వచ్చింది. అయితే, ఇప్పటివరకు జాట్‌లకు సీఎం పీఠం దక్కలేదు. దాంతో అంతా ఈ సారైనా ‘జాట్స్’ జాక్‌పాట్ కొడ్తారా? అని చూస్తున్నారు.
ఇప్పటివరకు రాజస్థాన్‌లోని దాదాపు అన్ని కీలక వర్గాలకు కనీసం ఒకసారైనా సీఎం పదవి వరించింది. జాట్లను తప్ప. రాష్ట్రంలో సుమారు 11 శాతం ఓటర్లున్నప్పటికీ, రాజకీయంగా ప్రభావం చూపగల వర్గం అయినప్పటికీ, దాదాపు కీలక పార్టీలన్నింటిలో ప్రాధాన్య స్థానాల్లో తమవాళ్లు ఉన్నప్పటికీ.. సీఎం కుర్చీపై ఇంతవరకు ఒక జాట్ కూర్చోలేకపోయాడు. 1998లో ఆ కల నెరవేరే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ గెలిస్తే తమవాడైన పరస్ రామ్ మాదెర్న సీఎం అయ్యే అవకాశాలుండటంతో తమ వారిలో 42 మందిని జాట్లు అసెంబ్లీకి పంపించారు. కానీ అప్పుడా అవకాశాన్ని ‘తమవాడు’ కాని అశోక్ గెహ్లాట్ తన్నుకుపోయాడు.
ఆ కసితో ఆ తరువాతి అసెంబ్లీ ఎన్నికల్లో(2003) బీజేపీ వైపు మొగ్గు చూపారు. జాట్ వర్గీయుల కోడలైన వసుంధర రాజే ముఖ్యమంత్రి అయ్యారు. కనీసం జాట్ వర్గీయుల కోడలైనా సీఎం అయిందని సంతోషించారు. అయితే, వసుంధర రాజే జాట్ వర్గీయుల ఆకాంక్షలను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఈ సారైనా అవకాశమిస్తారన్న ఆశతో 2008లో జాట్‌లు మరోసారి కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. కానీ జాట్ల బద్ధ శత్రువు అశోక్ గెహ్లాటే మళ్లీ సీఎం అయ్యాడు. జాట్ పవర్ చూపించి సీఎం కుర్చీలో జాట్‌ను కూర్చోబెట్టాలన్న వారి కోరిక 2013 ఎన్నికల్లో అయినా తీరుతుందేమో చూడాలి.
పార్టీ ఏదైనా.. మా వాడే గెలవాలి..!
జాట్‌లకు ‘స్వ’ అభిమానం ఎక్కువ. జాట్‌ల ఓటింగ్ సరళి గురించి ఇలా చెప్పుకుంటారు. పార్టీలకు సంబంధం లేకుండా పోటీలో తమ వాడుంటే ఆ అభ్యర్థికే దాదాపు అందరూ ఓటేస్తారు. తమవాళ్లే ఇద్దరు ఉంటే ఇద్దరిలో వయసులో పెద్దవాడిని గెలిపించేందుకు ప్రయత్నిస్తారు(1990లో బలరామ్ జాఖఢ్‌పై దేవీలాల్ గెలుపును ఈ కోణంలోనే విశ్లేషిస్తారు). అందుకే ఒక పార్టీ జాట్‌ను నిలబెడ్తే.. మరో ప్రధాన పార్టీ కూడా జాట్‌నే నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంది. పార్టీలకిచ్చే మద్దతు విషయానికొస్తే.. ముస్లింల వలె జాట్‌లు మొదటినుంచి కాంగ్రెస్ వోట్‌బ్యాంక్. అయితే, బీజేపీ రాజకుటుంబీకుల పార్టీ. రాజ్‌పుత్‌ల మద్ధతు ఆ పార్టీకి ఎక్కువ. రాజ్‌పుత్‌లు, జాట్‌ల మధ్య రాష్ట్రంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉంది. దాంతో సాధారణంగా వాళ్లు వేరువేరు పార్టీలకు మద్దతిస్తుంటారు. అశోక్ గెహ్లాట్‌పై కోపంతో 2003లో వసుంధర రాజేకు మద్దతిచ్చినట్లు.. పరిస్థితులు డిమాండ్ చేస్తే జాట్లు బీజేపీనీ గద్దెనెక్కించగలరు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ.. రెండు పార్టీలు జాట్ ఓట్లపై ఆశలు పెట్టుకున్నాయి. ఈ మధ్య కాలంలో పరిస్థితులు కూడా మారాయి. రాజ్‌పుత్‌లు సామాన్యులకు దూరమయ్యారు.
ప్రజలేం కోరుకుంటున్నారు?
డిసెంబర్ 1న రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్‌పీ, జేడీ(యూ), ఎన్‌సీపీ, వామపక్షాలు.. తదితర జాతీయ, ప్రాంతీయ పార్టీలు బరిలో ఉన్నా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. అయితే, పార్టీలకు అతీతంగా ఆ రాష్ట ప్రజలు ఎలాంటి ప్రభుత్వం కోరుకుంటున్నారు? రాబోయే ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు?.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలు కోరుకుంటున్న మూడు ప్రధాన డిమాండ్లుగా ఇవి పలు సర్వేల్లో తేలింది.
1) అవినీతిరహిత ప్రభుత్వం: అశోక్ గెహ్లాట్‌ది అవినీతిమయ పాలనగా పేరుగాంచడంతో ప్రజలు నీతిమంత పాలనను కోరుకుంటున్నారు. అభ్యర్థి ఏ పార్టీ వాడైనా అవినీతి మరకలుంటే దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారు.
2) భద్రత: రాష్ట్రంలో శాంతి, భద్రతలను కాపాడడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా స్త్రీలు, మైనారిటీలు తమపై జరిగే నేరాలను అరికట్టే ప్రభుత్వం కావాలంటున్నారు.
3) నాణ్యమైన పాలన: అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టి నాణ్యమైన పాలనను అందించే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్థికరంగం, విద్య, ఉపాధి.. తదితర రంగాలపై దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపే నాయకత్వాన్ని ఆశిస్తున్నారు.
అయితే, సీట్ల సంఖ్యకు సంబంధం లేకుండా ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని పలు సర్వేలు సూచిస్తున్నాయి. అవినీతిమయ రాజకీయాలు కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం కాగలవని భావిస్తున్నాయి.