లక్నో : రాజస్థాన్‌లోని ఆళ్వార్ జిల్లాలో ఏప్రిల్ 26న దళిత మహిళపై జరిగిన అత్యాచార ఘటనను అణచివేసేందుకు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని బీఎస్పీ చీఫ్ మాయావతి విమర్శలు గుప్పించారు. ఐదుగురు కీచకులు ఓ మహిళపై అకృత్యానికి పాల్పడితే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా బాధిత కుంటుంబాన్ని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పబ్బం కోసం కాంగ్రెస్ నిందితులను వెనకేసుకొస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బాధితురాలికి న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని, ఘటన వివరాలను సుమోటాగా స్వీకరించి సుప్రీం కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
(చదవండి : భర్త కళ్లెదుటే దారుణం..!)
ఇక రాష్ట్రంలో ఓ పక్క ఎన్నికలు జరుగుతుండగా.. మరోపక్క పట్టపగలే మహిళలకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు. ఎన్నికల కమిషన్‌కు ఇవేవీ కనిపించవా అని అన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రాజకీయ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోవడం ఈసీని ప్రశ్నించారు. మహిళల గౌరవానికి భంగం కలిగే విధంగా అసభ్యంగా మాట్లాడే పొలిటీషన్స్ వ్యాఖ్యల్ని సుమోటాగా స్వీకరించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక అంబేద్కర్ పేరుతో పుట్టుకొచ్చిన కొన్ని సేవా సంస్థలు కాంగ్రెస్, బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని, అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని బీఎస్పీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment