
సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాలని మోదీ తనను కోరారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై బుధవారం లోక్‌సభలో మళ్లీ దుమారం చెలరేగింది. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో చెప్పాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పాలంటూ డిమాండ్ చేశాయి. కేంద్రం తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కశ్మీర్ అంశంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నరేంద్రమోదీ జపాన్‌లో సమావేశమయినపుడు కశ్మీర్ వివాదం గురించి ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. కశ్మీర్ అంశం భారత గౌరవానికి సంబంధించిందన్నారు. కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం చేయమని ట్రంప్‌ను మోదీ కోరలేదని మంత్రి సమాధానమిచ్చారు.
కశ్మీర్ వివాదంపై మధ్యవర్తిత్వం చేపట్టాలని నరేంద్ర మోదీ తనను కోరినట్టుగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం వ్యాఖ్యానించగా దీనిపై దేశంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దేశ ఆత్మగౌరవాన్ని అమెరికా కాళ్లముందు ఉంచారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కాగా మోదీ ట్రంప్‌తో చర్చించిన అంశాలను బయటపెట్టాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ సమాధానమిస్తూ.. మోదీ మధ్యవర్తిత్వం కోరలేదని వెల్లడించారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేయడం తగదని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment