న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ వరుసగా మూడో రోజు కూడా వాయిదా పడింది. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే తమ సమస్యల గురించి తక్షణమే చర్చించాలని నోటీసులు ఇచ్చిన ఎంపీల పేర్లను చైర్మన్ వెంకయ్యనాయుడు చదువుతుండగానే అస్సాంకు చెందిన ఎంపీలంతా ఆందోళన మొదలుపెట్టారు. వీరికి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు జతకలిశారు. దీంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమయ్యాక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజూజు రాజ్యాంగ (125వ సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం విపక్ష సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. ఆర్జేడీ, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ సభ్యులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి కాంగ్రెస్ సభ్యులు కూడా జతకలిశారు. పౌరసత్వ సవరణ బిల్లు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోసం ప్రవేశపెట్టిన రోస్టర్ విధానానికి వ్యతిరేకంగా విపక్ష నేతలు ఆందోళన నిర్వహించారు. జీరో అవర్‌లో మాట్లాడే అవకాశం ఇస్తామని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ హామీ ఇవ్వడంతో ఎస్పీ నేతలు ఆందోళన విరమించారు. మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. రోస్టర్ విధానానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్, రివ్యూ పిటిషన్‌లను దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. విపక్ష సభ్యులు వెనక్కుతగ్గకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు హరివంశ్ ప్రకటించారు.
ఎంపీ మృతితో లోక్‌సభ వాయిదా..
బిజు జనతా దళ్ (బీజేడీ) ఎంపీ కిషోర్ స్వాయిన్ (71) మృతితో లోక్‌సభ వాయిదా పడింది. ఒడిశాకు చెందిన కిషోర్ బుధవారం ఉదయం భువనేశ్వర్‌లో మృతిచెందారు. లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ కిషోర్ మృతి విషయాన్ని సభ్యులకు తెలిపారు. అనంతరం సభ్యులు ఆయన మృతికి సంతాపంగా మౌనం పాటించారు. ఆ తర్వాత సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
Published Thu, Feb 7 2019 2:54 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment