
ఐదు రాష్ట్రాల్లో తప్పని రాజ్యసభ ఎన్నికలు
- ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
- యూపీ. కర్ణాటక, రాజస్తాన్, ఎంపీ, హరియాణాల్లో ఎన్నికలు
- గోయల్, సురేశ్ ప్రభు, చిదంబరం, శరద్ యాదవ్ ఏకగ్రీవం
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా మారాయి. ఏపీతోపాటు మహారాష్ట్ర. తమిళనాడు. బిహార్, పంజాబ్, ఒడిశాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవగా.. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హరియాణాల్లో ఎన్నికలు అనివార్యమయ్యాయి. శుక్రవారం రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువుముగిసిన తర్వాత ఎన్నికలపై మరింత స్పష్టత వచ్చింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సురేశ్ ప్రభుతోపాటు కాంగ్రెస్ నేత పి. చిదంబరం, జేడీయూ నేత శరద్ యాదవ్ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు. మహారాష్ట్ర నుంచి గోయల్, వీరూ సహస్రబుద్ధే, వికాస్ మహాత్మే (బీజేపీ), సంజయ్ రౌత్ (శివసేన), పి. చిదంబరం (కాంగ్రెస్), ప్రఫుల్ పటేల్ (ఎన్సీపీ) ఎంపికయ్యారు.
తమిళనాడు నుంచి అన్నాడీఎంకే నుంచి నలుగురు, డీఎంకే నుంచి ఇద్దరు కూడా ఎన్నిక లేకుండానే పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. ఏపీ నుంచి కేంద్ర మంత్రులు సురేశ్ ప్రభు, సుజనా చౌదరిలతోపాటు టీజీ వెంకటేశ్, వి. విజయసాయి రెడ్డిలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఒడిశా నుంచి ముగ్గురు బీజేడీ సభ్యులు ఏకగ్రీవంగా గెలవగా.. ఛత్తీస్‌గఢ్ నుంచి బీజేపీ, కాంగ్రెస్ తరపున ఒక్కొక్కరు పోటీ లేకుండానే విజయం సాధించారు. బిహార్ నుంచి జేడీయూ నేత శరద్ యాదవ్, ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది రాం జెఠ్మలాని, లాలూ ప్రసాద్ కూతురు మిసా భారతితోపాటు జేడీయూ, బీజేపీ నుంచి ఒక్కొక్కరు పోటీ లేకుండానే గెలిచారు.
యూపీలో 11 సీట్లకోసం 12 మంది బరిలో ఉండటంతో ఎన్నిక అనివార్యమైంది. 34 మంది మద్దతు కావాల్సిన ఎన్నికల్లో కాంగ్రెస్ (కపిల్ సిబల్)కు 29 మందే ఉన్నారు. అయితే తమ పార్టీ నుంచి ఇద్దరిని గెలిపించుకున్నాక మిగిలిన 12 మందితో కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతామని బీఎస్పీ ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో 3 స్థానాలకు ఎన్నికకోసం బీజేపీ నుంచి ఎంజే అక్బర్‌తోపాటు మరో నేత గెలవనుండగా, బీజేపీ మూడో అభ్యర్థిని (స్వంతంత్ర) బరిలో ఉంచింది. నలుగురికే అవకాశమున్న కర్ణాటకనుంచి ఆరుగురు బరిలో ఉన్నారు.