ప్రయాగరాజ్ : కుంభమేళా వేదికగా పొగతాగడం మానుకోవాలని యోగా గురు రాందేవ్ బాబా సాధుసంతులను కోరారు. ‘మనం ఎన్నడూ పొగతాగని రాముడు, కృష్ణుడు వంటి దేవతలను ఆరాధిస్తాం..మరి మనం వాటికి ఎందుకు దూరంగా ఉండకూడ’దని సన్యాసులను ప్రశ్నించారు. స్మోకింగ్‌ను విడిచిపెడతామని మన మంతా ప్రతినబూనాలని పిలుపుఇచ్చారు.
‘సమున్నత లక్ష్యం కోసం మనం తల్లితండ్రులను, ఇంటిని విడిచిపెడతాం..అలాంటిది మనం పొగతాగడాన్ని ఎందుకు మానుకోలే’మని అన్నారు. ఇక పలువురు సన్యాసుల నుంచి ఆయన పొగగొట్టాలను సేకరించి, పొగతాగడం మానివేస్తామని వారితో ప్రతిజ్ఞ చేయించారు. తాను నిర్మించి మ్యూజియంలో ఈ పొగగొట్టాలను ప్రదర్శిస్తానని చెప్పుకొచ్చారు.
తాను యువతను పొగాకు, స్మోకింగ్‌ను వదిలివేసేలా చేశానని, మహాత్ములచే ఆ పని ఎందుకు చేయించలేనన్నారు. కాగా 55 రోజుల పాటు సాగే కుంభమేళా మార్చి 4న ముగుస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక వేడుకగా పేరొందిన కుంభమేళాలో పలు దేశాల నుంచి 13 కోట్ల మంది పాల్గొని పవిత్ర గంగా జలాల్లో పుణ్యస్నానం ఆచరిస్తారని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment