ముంబై : సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్ వ్యవహారంలో బ్యాంక్ వ్యవస్ధాపకుడు రాణా కపూర్ నిర్వాకాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకు నుంచి పెద్దమొత్తంలో రుణాలు పొందిన కంపెనీల నుంచి ముడుపులు పొందేందుకు రాణా కపూర్‌తో పాటు ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలు 20 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్టు ఈడీ గుర్తించింది. యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ఆదివారం రాణా కపూర్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. కపూర్ అరెస్ట్‌తో ఆయన అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి.
దివాలా తీసిన హౌసింగ్ ఫైనాన్స్‌కంపెనీ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు యస్ బ్యాంక్ రూ 3700 కోట్లు రుణం ఇవ్వగా ఈ మొత్తం అంతా నిరర్ధక ఆస్తులుగా మారింది. ఇంత మొత్తం రుణం పొందిన డీహెచ్‌ఎఫ్‌ఎల్ కపూర్ కుటుంబానికి రూ 600 కోట్లు ముట్టచెప్పింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ తరహాలో యస్ బ్యాంక్ నుంచి అక్రమంగా రుణాలు పొందిన కార్పొరేట్ సంస్థలు కపూర్ కుటుంబానికి చెందిన షెల్ కంపెనీల్లోకి ముడుపులను తరలించాయి. అక్రమ మార్గాల్లో నిధులు స్వీకరించిన కపూర్ కుటుంబం రూ 2000 కోట్ల వరకూ వివిధ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా ఈ ఆస్తుల విలువ రూ 5000 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బ్రిటన్‌లోనూ కపూర్ కుటుంబం రెండు ఆస్తులను కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. మరోవైపు యస్ బ్యాంక్ వ్యవహారంపై సీబీఐ సైతం దర్యాప్తును చేపట్టింది. ఈడీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐతో సీబీఐ ఈ దిశగా సంప్రదింపులు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment