
5వేల డిపాజిట్‌పై యూటర్న్
• 5 వేల డిపాజిట్‌పై వెనక్కి తగ్గిన రిజర్వ్ బ్యాంక్
• డిసెంబర్ 30 వరకు ఎంతైనా వేసుకోవచ్చని ప్రకటన
• కేవైసీ ఉంటే అధికారులు ప్రశ్నించరని భరోసా
• బుధవారం మధ్యాహ్నం నుంచి బ్యాంకుల ముందు పెరిగిన క్యూలు
ముంబై: బ్యాంకు ఖాతాల్లో ఒకసారి రూ.5వేలకు మించి పాతనోట్లు డిపాజిట్ చేయరాదన్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ఎదురవటంతో ఆర్బీఐ వెనక్కు తగ్గింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) సర్టిఫికెట్లు సమర్పించిన వినియోగదారులు డిసెంబర్ 30 వరకు ఎన్నిసార్లైనా ఎంత మొత్తంలోనైనా పాతనోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇన్నిరోజులు ఎందుకు పాతనోట్లు డిపాజిట్ చేయలేదనే ప్రశ్న కూడా బ్యాంకు అధికారులు అడగబోరని స్పష్టం చేసింది. మంగళ, బుధవారాల్లో అరుణ్‌జైట్లీ ప్రకటన (ఎంతమొత్తం డిపాజిట్ చేసినా బ్యాంకు అధికారులు ప్రశ్నించరు), ఆర్బీఐ ప్రకటనల్లో (అధికారులు ప్రశ్నిస్తారు) వైరుధ్యం నేపథ్యంలో.. డిపాజిట్ నిబంధనలను పూర్తిగా సమీక్షించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.
బుధవారం ఉదయం వరకు రెండ్రోజులుగా నడుస్తున్న పద్ధతిలోనే ప్రశ్నావళితో ముందుకెళ్లిన బ్యాంకు అధికారులు.. మధ్యాహ్నం నుంచి ఆర్బీఐ తాజా ఆదేశాలను అమలుచేసి ప్రశ్నించటం ఆపేశారు. అయితే కేవైసీ నిబంధనను మాత్రం బ్యాంకులు కఠినంగా అమలుచేస్తున్నాయి. కాగా, నోట్లరద్దు పథకం అమల్లోకి వచ్చాక రూ. 5.92 లక్షల కోట్ల మొత్తాన్ని మార్కెట్‌లోకి బ్యాంకింగ్ రంగం ద్వారా పంపించామని ఆర్బీఐ వెల్లడించింది.
‘ఎలక్ట్రానిక్’ రుసుముపై నిషేధం: నోట్లరద్దు నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేదిశగా.. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఐఎంపీఎస్, యూపీఐ ద్వారా చెల్లింపులపై రుసుంను నిషేధించాలని ఆర్థిక శాఖ కోరింది. వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ నెఫ్ట్ ట్రాన్స్‌ఫర్‌కు రుసుములను తొలగించాలని ఓ ప్రకటనలో సూచించింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రూ.10వేల వరకు నెఫ్ట్‌కు బ్యాంకులు రూ.2.5, పదివేల నుంచి లక్ష వరకు రూ.5, రూ.1–2లక్షల వరకు రూ. 15, రెండు లక్షలకన్నా ఎక్కువగా ఉంటే రూ. 25 వసూలు చేస్తున్నాయి. సర్వీస్ టాక్స్ దీనికి అదనం.
ఆర్థిక శాఖ సూచన ప్రకారం ఐఎంపీఎస్, యూపీఐ చెల్లింపుల రుసుములపై మార్చి 31, 2017 వరకు నిషేధం అమల్లో ఉంటుంది. యూఎస్‌ఎస్‌డీ లావాదేవీలపై వెయ్యి, అంతకుమించిన చెల్లింపులపై యాభై పైసలు తగ్గనుంది. ఇప్పటికే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ‘లక్కీ గ్రాహక్ యోజన, డిజి ధన్ వ్యాపార్ యోజన’లను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, వినియోగదారుల అకౌంట్లలో రూ.5వేల కన్నా ఎక్కువ జమచేస్తుంటే బ్యాంకు అధికారులే విచారణ చేయాలంటూ ఆర్బీఐ రెండ్రోజుల క్రితం ఇచ్చిన ఆదేశాలపై అఖిల భారతీయ బ్యాంకు అధికారుల సంఘం నిరసన చేపట్టింది.
ఐడీఎస్ నల్లధనం రూ. 55 వేల కోట్లే!
న్యూఢిల్లీ: ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్) కింద ప్రకటించినట్లు పేర్కొన్న రూ. 67,382 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం రూ. 55 వేల కోట్లకు తగ్గించి చూపే అవకాశముంది. తమ వద్ద లెక్కల్లో చూపని రూ. 10 వేల కోట్లకుపైగా నల్లధనం ఉందని చెప్పిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మణ రావు, ఆయన సన్నిహితులు ఆ డబ్బుపై పన్ను తొలి వాయిదాను నవంబర్ 30లోగా చెల్లించకపోవడంతో ఈమేరకు సవరణ చేయనున్నారు. నల్లధన ప్రకటనకు తెచ్చిన ఐడీఎస్ పథకం గడువు సెప్టెంబర్ 30తో ముగియడం తెలిసిందే.