43 రోజులు.. 60 పల్టీలు!
• ‘నోట్ల రద్దు’పై రిజర్వు బ్యాంకు పిల్లిమొగ్గలు
• మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయలేక ఆపసోపాలు...
• గత 43 రోజుల్లో.. ఏకంగా 60 సార్లు వెనుకడుగు
నోట్ల రద్దు’నిర్ణయాన్ని అమలు చేయడంలో రిజర్వు బ్యాంకు ఆపసోపాలు పడుతోంది. ఉద్ధండులైన ఆర్థికవేత్తలున్నా.. అడ్డగోలు నిర్ణయాలతో అసంబద్ధ నిబంధనలను ప్రకటిస్తూ నవ్వుల పాలవుతోంది. తర్వాత నాలుక కరుచుకుని.. వాటిని వెనక్కి తీసుకుంటోంది. ఇలా నోట్ల రద్దును ప్రకటిం చిన నవంబర్ 8 నుంచి ఇప్పటివరకు.. 43 రోజుల వ్యవధిలో ఏకంగా 60 సార్లు జరిగింది.
అందులో కొన్ని ప్రధాన అంశాలు..
నవంబర్ 8న మోదీ నోట్ల రద్దును ప్రకటించారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు పోస్టాఫీసులు,బ్యాంకుల్లో పాత నోట్లు ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయవచ్చని ఆర్‌బీఐ చెప్పింది. తర్వాత 4 రోజులకే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. పాతనోట్ల డిపాజిట్‌కు తొందరపడవద్దని, ఇంకా 46 రోజుల టైముందనీ సెలవిచ్చారు.
పరిమితులపై మల్లగుల్లాలు: నవంబర్ 8 తర్వాత బ్యాంకుల్లోంచి పాత నోట్లకు బదులుగా విత్‌డ్రా చేసుకోగలిగిన మొత్తం రోజుకు రూ.4వేలు. ఈ పరిస్థితి 15 రోజులు ఉంటుందని ఆర్‌బీఐ భరోసా ఇచ్చింది. కానీ 9 రోజులకే మాట మార్చి.. రోజుకు రూ.2 వేల కంటే ఎక్కువ విత్‌డ్రా కుదరదంది. తర్వాత.. నవంబర్ 15న నోట్ల మార్పిడి చేసుకున్న వారి వేలిపై ముద్రవేస్తామని ప్రకటన చేసింది. ఎన్నికల సంఘం అక్షింతలతో వెనక్కి తగ్గి, బేషరతుగా ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసుకోవచ్చంది. తర్వాత రూ.2.5 లక్షల కంటే ఎక్కువ వేస్తే విచారణ, చర్యలు ఉంటాయని బాంబు పేల్చింది.
సడలింపులు.. బిగింపులు: విత్‌డ్రా నిబంధనలపై జనం మండిపడ్డంతో.. ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఖాతా నుంచి రూ.2.5 లక్షల వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది. కానీ పలు నిబంధనలు పెట్టింది. ఖాతాదారు వివరాలన్నీ (కేవైసీ) తెలిపిన ఖాతాల్లోంచే విత్‌డ్రాకు అనుమతించడం, డిసెంబర్ 30 లోపు పెళ్లి ఉంటేనే నగదు ఇవ్వడం వంటి నిబంధనలపై ఆగ్రహం వ్యక్తమైంది. తరువాత వారానికి రూ.24 వేల వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చని.. రైతులు, కంపెనీలు రూ.50 వేల వరకు తీసుకోవచ్చని మినహాయింపులు ఇచ్చింది.
మరో పిల్లిమొగ్గ!
తాజాగా రూ.5వేల కంటే ఎక్కువ మొత్తంలో పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు ఒకే ఒక్క అవకాశం కల్పిస్తామని.. అది కూడా అప్పటివరకూ ఎందుకు డిపాజిట్ చేయలేకపోయా రో బ్యాంకు అధికారులకు వివరణ ఇచ్చాకేనని ఆర్‌బీఐ హుకుం జారీ చేసింది. ‘మా ప్రధాని, ఆర్థిక మంత్రి డిసెంబర్ 30 దాకా డిపాజిట్ చేసుకోవచ్చన్నారు కాబట్టి నేను ఇప్పటివరకూ చేయలేదు’ అన్న కామెంట్లు బ్యాంకులకు చేరడంతో మళ్లీ వెనక్కితగ్గింది. ‘మీ డబ్బు.. ఎంతైనా జమచేసుకోండి!’ అంటూ నాలుక కరిచేసుకుంది!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్