న్యూఢిల్లీ: రైల్వే బోర్డు త్వరలో పలు సంస్కరణలు చేపట్టనుంది. దీనిలో భాగంగా బోర్డు సభ్యుల సంఖ్యకు కోత విధించనుంది. బోర్డులో డైరెక్టర్, ఆపై స్థాయి అధికారులను వివిధ జోన్లకు బదిలీ చేయాలని భావిస్తోంది. రైల్వేల నిర్వహణ తీరును మెరుగుపరచడం కోసం ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైల్వే బోర్డులో 200 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో డైరెక్టర్, ఆపై స్థాయి అధికారులుగా ఉన్న 50 మందిని (25 శాతం) రైల్వే జోన్లకు బదిలీ చేయాలని భావిస్తున్నట్లు ఓ అధికారి ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం బోర్డులో చాలా మంది సభ్యులు ఉన్నారని వీరంతా దాదాపు ఒకేలాంటి పనులు చేస్తున్నారని తెలిపారు. జోన్లలో సీనియర్ ఆఫీసర్ల కొరత కూడా ఉండటంతో వీరిని అక్కడికి బదిలీ చేయాలని భావిస్తున్నామన్నారు. వంద రోజుల ఎజెండాలో భాగంగా ఇటీవల రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రైల్వే బోర్డు చైర్మన్‌కు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment