బలవంతంగా పంపేశారు!
న్యూఢిల్లీ: సహోద్యోగినులను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ఆర్కే పచౌరిని టెరి నుంచి బలవంతంగా సెలవులో పంపించారు. ఆయన స్థానంలో నూతన చైర్మన్‌గా అశోక్ చావ్లాను టెరి పాలక మండలి ఎన్నుకుంది. అదేవిధంగా అజయ్ మాథుర్‌కు పూర్తి కార్యనిర్వహణ అధికారాలు కట్టబెడుతూ కౌన్సిల్ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కే పచౌరిని ఇంధన వనరుల సంస్థ (టెరి) చైర్మన్‌గా నియమిస్తూ తాజాగా పాలకమండలి నిర్ణయం తీసుకోవడం తీవ్ర దుమారం రేపింది. తన జూనియర్ సహ ఉద్యోగిని తీవ్రంగా లైంగికంగా వేధించినట్టు పచౌరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పచౌరిపై కేసు నమోదుచేసిన ఆమె ప్రస్తుతం టెరికి రాజీనామా చేసింది. ఈ కేసులో బెయిల్ మీద బయటకొచ్చిన పచౌరీని తిరిగి టెరికి తీసుకురావడం తాజా వివాదానికి కారణమైంది. ఆయనపై మరో టెరి ఉద్యోగిని కూడా లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో టెరి వైస్ చైర్మన్‌గా నియమించిన పచౌరిని దీర్ఘకాలిక సెలవుపై బలవంతంగా పంపిస్తూ తాజాగా పాలక మండలి నిర్ణయం తీసుకుంది.