న్యూఢిల్లీ : రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) మాజీ ఎంపీ షహబుద్దీన్‌కు బెయిల్ మంజూరు అయినా చిక్కులు తప్పడం లేదు. ఆయనకు బెయిల్ మంజూరు చేయటాన్ని సవాల్ చేస్తూ బిహార్ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..ఈ కేసులో షహబుద్దీన్ వాదనలు కూడా వినాలంటూ ఈ మేరకు సోమవారం నోటీసులు ఇచ్చింది.
అయితే షహబుద్దీన్ బెయిల్పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి (సెప్టెంబర్ 26) వాయిదా వేసింది. షాబుద్దీన్కు నోటీసులు జారీ చేయాల్సిందిగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, జస్టిస్ అమితవ రాయ్ ధర్మాసనం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
కాగా మర్డర్ కేసులో యావజ్జీవ శిక్ష పడిన షహబుద్దీన్‌కు పట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 2004లో గిరీశ్ రాజ్, సతీష్ రాజ్ అనే సోదరులను అపహరించుకుపోయి, యాసిడ్ పోసి మరీ హత్య చేశారనే నిర్థారణతో అతడికికు జైలు శిక్ష పడింది.
అయితే పదకొండేళ్ల తర్వాత షహబుద్దీన్‌కు పట్నా కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో బెయిల్ను సవాల్ చేస్తూ బిహార్ సర్కార్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. మరోవైపు షహబుద్దీన్‌కు బెయిలు మంజూరు చేయడంపై సివాన్ వాసి చంద్రకేశ్వర్ ప్రసాద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయన ముగ్గురు కుమారులను షహబుద్దీన్ హత్య చేయించారనే ఆరోపణలు ఉన్నాయి.