సచిన్‌ పైలట్‌ సంచలన వ్యాఖ్యలు! | Sachin Pilot Comments On Kota Infants Deaths No Point Blaming Past Govt | Sakshi
Sakshi News home page

సొంత ప్రభుత్వంపై సచిన్‌ పైలట్‌ విమర్శలు

Published Sat, Jan 4 2020 5:15 PM | Last Updated on Sat, Jan 4 2020 5:28 PM

Sachin Pilot Comments On Kota Infants Deaths No Point Blaming Past Govt - Sakshi

జైపూర్‌: కోటలోని  జేకే లోన్‌ ప్రభుత్వాసుపత్రిలో వంద మంది శిశువులు మరణించిన ఘటనపై రాజస్తాన్‌ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ స్పందించారు. ఈ విషాదకర ఘటనపై బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా అన్నింటికీ గత ప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రయోజనం ఉండదని చురకలు అంటించారు. కోటలో నెలరోజుల వ్యవధిలో వంద మంది నవజాత శిశువులు మరణించడం కలకలం రేపిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై కోటా నియోజకవర్గం నుంచి గెలుపొందిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ట్వీట్‌ చేసిన తర్వాత.. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ స్పందించారు. ఈ క్రమంలో ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హెచ్‌ ఎల్‌ మీనాను తొలగించి, దాని పర్యవేక్షణ బాధ్యతల్ని వైద్య విద్యా శాఖ కార్యదర్శికి అప్పగించారు. అయినప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గత బీజేపీ ప్రభుత్వం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని సీఎం అశోక్‌ గెహ్లోత్‌ వ్యాఖ్యానించారు.(అందుకే వాళ్లంతా మరణించారు! )

ఈ క్రమంలో శనివారం కోట ఆస్పత్రిని సందర్శించిన అనంతరం డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ మీడియాతో మాట్లాడారు. ‘ ఇది చాలా సున్నిమతమైన అంశం. శిశువుల మరణానికి మనమే బాధ్యత వహించాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసి 13 నెలలు గడిచిన తర్వాత కూడా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూర్చుంటే సరిపోదు. జవాబుదారీతనం పెరగాలి. గతం గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు ఏం జరుగుతుందనే దాని గురించే చర్చ అవసరం. ఇటువంటి ఘటనలు జరిగినపుడు ఎవరూ బాధ్యతల నుంచి తప్పించుకోకూడదు. ఎంతో మంది పిల్లలు చనిపోయారు. వసుంధరా రాజే పొరపాట్ల వల్ల ప్రజలు ఆమెను అధికారానికి దూరం చేశారు. కాబట్టి మనం బాధ్యతగా వ్యవహరించాలి’ అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

కాగా రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంలో సచిన్‌ పైలట్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రాజస్తాన్‌ సీఎం అవుతారంటూ ఊహాగానాలు వినిపించనప్పటికీ.. సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లోత్‌నే సీఎం పదవి వరించింది. సచిన్‌ను ఆయన డిప్యూటీగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఇక సచిన్‌ సొంత ప్రభుత్వం గురించి ఇలా వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి.(కోట ఆసుపత్రి మృత్యుగీతం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement