కార్తీక్ weds సందీప్!
కాలిఫోర్నియాలో పెళ్లాడిన
భారతీయ అమెరికన్ గేలు
బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా వేడుక
సీన్ అర్థమైపోయింది కదా. ఇద్దరు అబ్బాయిల వింత పెళ్లి. వరూవరుళ్లు సందీప్, కార్తీక్. భారతీయ అమెరికన్లయిన వీరు స్వలింగ సంపర్కులు. అమెరికాలో గే పెళ్లిళ్లు కొత్తేం కాదుకదా అని తీసిపారేయకండి. వీరిది ఆషామాషీ పెళ్లికాదు. బోలెడంత ప్రత్యేకత ఉంది. తిరువనంతపురంలో పుట్టి అమెరికాలో సెటిలై న సందీప్‌కు అమెరికాలో పుట్టిన కార్తీక్‌తో 2012లో ఓ డేటింగ్ వెబ్‌సైట్‌లో పరిచయమైంది. ప్రేమపక్షులు ఒకరికొకరు తెగ నచ్చేశారు. పరిచయం ముదిరి ప్రేమగా మారింది. పెళ్లిబంధంతో ఒకటి కావాలనుకున్నారు. 2013లో తమ తల్లిదండ్రులకు సంగతి చెప్పి అనుమతి కోరారు. తల్లిదండ్రులు తొలుత షాక్ తిన్నా తర్వాత విశాల హృదయంతో ఒప్పేసుకున్నారు. ఇంకేం అబ్బాయిలు ఎగిరి గంతేశారు. పెళ్లిని అంగరంగవైభోగంగా, అగ్నిసాక్షిగా పక్కా మలయాళీ సంప్రదాయం ప్రకారం జరుపుకోవాలనుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు.
తర్వాత పెళ్లి ఏర్పాట్లు మొదలెట్టారు. సిగ్గుపడకుండా బంధుమిత్రుల ఇళ్లకెళ్లి ‘మా పెళ్లికి సకుటుంబసమేతంగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి’ అంటూ ఆహ్వాన పత్రికలు పంచారు. ఈ ఏడాది జనవరి 18న శుభముహూర్తంలో కాలిఫోర్నియాలో పెళ్లిపీటలెక్కారు. పురోహితుడు వేదమంత్రాలు పఠిస్తుండగా, బంధుమిత్రులు అక్షింతలు చల్లుతుండగా కార్తీక్.. సందీప్ మెడలో తాళి కట్టాడు. తర్వాత అగ్నిగుండం చుట్టూ ఏడడుగులు నడిచారు. వరుడు తన అర్ధాంగుడి చేయిపట్టుకుని అరుంధతీ నక్షత్రం చూపించాడు. ఆహూతులు కొత్తజంటకు కానుకలు సమర్పించి ఎవరికి తోచినట్లు వారు ఆశీర్వదించారు. కొబ్బరి దండిగా చేర్చి వండిన కమ్మని కేరళ వంటకాలతో ఆహూతులు భోంచేశారు. వీరి పెళ్లి సంగతి ఇటీవల సోషల్ మీడియాలో బయటకొచ్చి, గేలకు నూతనోత్తేజం ఇస్తోంది.