సప్తశృంగేరీ భక్తులకు ట్రాలీ సదుపాయం!
నాసిక్ః పన్నెండేళ్ళకోసారి కుంభమేళాతో దేశంలోని భక్తుల దృష్టిని ఆకర్షించే నాసికా త్రయంబకం దగ్గరలోని సప్త శృగేరీ దేవి భక్తులకు త్వరలో కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. సప్తశృంగి అమ్మవారిని నదీమార్గంలోనూ, కాలినడకన దర్శించే భక్తులు... ఇకపై ప్రత్యేక ట్రాలీలలో ప్రయాణించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ట్రాలీ ప్రాజెక్టు పూర్తి చేసి మరో రెండు నెలల్లో భక్తులకు అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు చెప్తున్నారు.
కొండపై కొలువైన సప్తశృంగి ఆలయాన్ని దర్శించే భక్తులకు ట్రాలీ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని ఎత్తైన కొండపైకి భక్తులు చేరడాన్ని సులభతరం చేసేందుకు ట్రాలీ ప్రాజెక్టును ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. సుయోగ్ గుర్బాక్సానీ ఫునిక్యులర్ రోప్వేస్ సంస్థ ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు సుమారు 85 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రత్యేక సదుపాయం ప్రారంభించినట్లైతే భక్తులు ఇక 500 మెట్లను కాలి నడకన ఎక్కాల్సిన అవసరం ఉండదని, కేవలం మూడు నిమిషాల్లో కొండపైకి చేరుకో గల్గుతారని ప్రాజెక్ట్ మేనేజర్ రాజీవ్ లుంబా తెలిపారు. భక్తులను తరలించేందుకు రెండు ట్రాలీలను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే వికలాంగులు, వృద్ధులకోసం ప్రత్యేక సేవలను అందించనున్నట్లు ఆయన తెలిపారు.
కొత్తగా ఏర్పాటు చేసే రోప్ వే సౌకర్యంలోని ఒక్కో ట్రాలీలో ట్రిప్పుకు 60 మంది వరకూ ప్రయాణించవచ్చని, రెండు ట్రాలీలు కలిసి గంటకు సుమారు 12 వందల మంది భక్తులను కొండపై ఆలయానికి చేరవేయగల్గుతాయని అధికారులు చెప్తున్నారు. అంతేకాక ట్రాలీల్లో ఏసీ సౌకర్యం కూడ ఉన్నట్లు తెలిపారు. నాసిక్ కు దగ్గరలోని కల్వాన్ తాలూకా నండూరి గ్రామంలో సప్తశృంగి ఆలయం ఉంది. ఈ ప్రసిద్ధ ఆలయాన్ని నవరాత్రుల సమయంలో లక్షలకొద్దీ భక్తులు సందర్శిస్తుంటారు. మహరాష్ట్ర ప్రభుత్వం, సప్తశృంగీ దేవి నివాసిని ట్రస్ట్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ నిర్వహణకు నిర్ణయించినట్లు ప్రాజెక్ట్ అధికారి లుంబా తెలిపారు.