న్యూఢిల్లీ: అన్ని రకాల సంక్షేమ పథకాలు, సేవలకు ఆధార్ నంబరును అనుసంధానించేందుకు గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. మొబైల్ నంబర్లకు ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు ఫిబ్రవరి 6ను చివరి తేదీగా ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు గతంలో తీర్పునివ్వడం తెలిసిందే. తాజాగా ఆ తీర్పులో కూడా మార్పులు చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్.. మొబైల్–ఆధార్ అనుసంధానానికి గడువును మార్చి 31 వరకు పొడిగించింది. బ్యాంకు ఖాతా తెరిచేవారు మొదట్లోనే తమ ఆధార్ నంబరును బ్యాంకు వారికి సమర్పించాల్సిన అవసరంలేదని పేర్కొంది.
ఆధార్ నంబరు లేకుంటే ఆధార్ కోసం దరఖాస్తు చేశారనే రుజువును బ్యాంకుకు చూపించాలని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే పాన్ కార్డుకు దరఖాస్తు చేయడానికి, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి మాత్రం కచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందేనంది. ఆధార్ పథకాన్నే సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై జనవరి 17 నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారణను ప్రారంభిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. సంక్షేమ పథకాలకు, సేవలకు ఆధార్‌ను అనుసంధానించేందుకు గడువును పొడిగించవచ్చంటూ అటార్నీ జనరల్ వేణుగోపాల్ అత్యున్నత న్యాయస్థానానికి గురువారం తెలిపిన అనంతరం కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment