సాగరం కబళిస్తోంది!!
వేగంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు
♦ 19012010 మధ్య 19 సెంటీమటర్లు పెరుగుదల
♦ 2100 నాటికి 1 మీ. నుంచి 7 మీ. పెరిగే అవకాశం
♦ దేశ దేశాల్లో తీర ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం
♦ భారత్‌తూర్పు తీరానికి ముంపు ముప్పు అధికం
♦ కోల్‌కతా, విశాఖ నగరాలు వందేళ్లలో నీటి పాలు
♦ ఆంధ్రప్రదేశ్‌తీరమంతా సముద్రంలో మునిగే అవకాశం
♦ ముంబై మహానగరానికి పొంచివున్న భారీ ముంపు
నిర్విరామంగా ఎగసిపడే సాగర కెరటాలు నెమ్మది నెమ్మదిగా భూభాగాన్ని కబళిస్తున్నాయి. భూవాతావణం వేడెక్కేకొద్దీ సముద్రమట్టం వేగంగా పెరుగుతోంది. 1901 నుండి ఇప్పటివరకూ దాదాపు 20 సెంటీమీటర్ల మేర సముద్ర మట్టం పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పెరుగుదల వేగం ఇటీవలి కాలంలో పెరిగిందని..
ఈ శతాబ్దం ముగిసే సరికి సముద్ర మట్టం ఒక అడుగు నుంచి ఒక మీటరు వరకూ పెరగవచ్చునని.. ధృవప్రాంతాల్లో మంచుదుప్పటి కరిగిపోతే ఏడు మీటర్ల వరకూ కూడా పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దానివల్ల తీర ప్రాంతాలు చాలా వరకూ సముద్రంలో మునిగిపోతాయని.. ఆ ప్రాంత ప్రజలకు చాలా కష్టనష్టాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో సుదీర్ఘ భారత తీరానికీ.. అందులోనూ లోతట్టు ప్రాంతమైన తూర్పు తీరానికి ఎక్కువ ముప్పు పొంచివుందని అప్రమత్తం చేస్తున్నారు. 2100 నాటికి సముద్ర మట్టాలు ఎలా పెరుగుతాయి, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనే దానిపై ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఆ అధ్యయనాల సారాంశమిదీ...
మామూలుగా సముద్రమట్టాలు స్థిరంగా ఉంటాయని మనం భావిస్తాం. కానీ భూగోళం చరిత్రను చూస్తే సముద్రమట్టాల్లో పెనుమార్పులు సంభవించిన విషయం స్పష్టమవుతుంది. భూగోళం దాదాపు లక్ష సంవత్సరాల విరామాలతో మంచు యుగం నుంచి మంచు యుగానికి పయనించింది. చివరి మంచు యుగం పతాకస్థాయిలో ఉన్నపుడు ఉత్తర అమెరికా ఖండం అత్యధిక భాగం మంచుతో నిండివుండేది. అప్పుడు సముద్ర మట్టం ఇప్పటికన్నా 400 అడుగులు తక్కువగా ఉండేది.
ప్రస్తుతం మనం మంచు యుగాల మధ్య ఉష్ణ కాలంలో ఉన్నాం. అంటే.. ఇప్పుడు సముద్రమట్టాలు వేగంగా పెరుగుతూపోతాయి. ఆ తర్వాత మళ్లీ తగ్గడం మొదలవుతాయి. కానీ మానవ కల్పిత వాతావరణ మార్పు ఈ చక్రాన్ని మారుస్తోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గతంలో సముద్రమట్టాల్లో మార్పులు చాలా నెమ్మదిగా సంభవించేవని, కొన్ని వేల ఏళ్లు పట్టేదని.. కానీ ఇప్పుడు భూతాపం పెరుగుతుండటం సముద్రమట్టాలు వేగంగా పెరుగడానికి కారణమవుతోందని వారు వివరిస్తున్నారు.
వేగంగా పెరుగుతున్న సముద్రమట్టాలు...
భూతాపం పెరగడం వల్ల ధృవాల్లో మంచుదుప్పట్లు కరుగుతుండడం, వాతావరణం వేడెక్కడం వల్ల సముద్ర జలాలు కూడా వేడెక్కి వ్యాకోచించడం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్లేసియర్లు కరుగుతుండటం వంటి పరిణామాల వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. 19012010 మధ్య ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టం సగటున 19 సెంటీమీటర్ల మేర పెరిగినట్లు వాతావరణ మార్పుపై ప్రపంచ సంఘం ఐదో అంచనా నివేదిక ఇటీవవల వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. 19012010 మధ్య కాలంలో ఏడాదికి సగటున 1.7 మిల్లీమీటర్ల చొప్పున సముద్ర మట్టం పెరిగినట్లు భావించవచ్చు.
అయితే.. నిజానికి 19712010 మధ్య ఈ పెరుగుదల సగటున ఏడాదికి 2.0 మిల్లీమీటర్లుగా ఉంటే.. 19932010 మధ్య ఏడాదికి 3.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. అంటే.. గత రెండు దశాబ్దాల్లో సముద్రం మట్టం వేగంగా పెరిగినట్లు తేటతెల్లమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అలల కొలతల నివేదికలు, ఉపగ్రహాల పరిశీలనల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇతర సముద్రాలతో పోలిస్తే 2003 నుండి ఉత్తర హిందూ మహాసముద్ర మట్టం రెండు రెట్లు ఎక్కువగా పెరిగిందని జర్నల్ ఆఫ్ జియోఫిజికల్ రీసెర్చ్ మేగజీన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది.
అంతకుముందు దశాబ్ద కాలంలో ఈ పెరుగుదల చాలా తక్కువగా ఉంది. ఉపగ్రహాల ద్వారా రెండున్నర దశాబ్దాల పాటు సేకరించిన సముద్ర ఉపరితల కొలతల సమాచారాన్ని విశ్లేషించి యూనివర్సిటీ ఆఫ్ హవాయి సీ లెవల్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ నిర్థారణకు వచ్చారు. సముద్రమట్టాల పెరుగుదల వల్ల ఇప్పటికే బంగ్లాదేశ్‌లో నాలుగో వంతు భూభాగం మునిగింది. చైనా, ఫిలిప్పీన్స్‌లలోని తీరప్రాంతాలు మునిగాయి. పశ్చిమ బెంగాల్లోని కోల్‌కతా వద్ద రివర్ డెల్టా సుందర్‌వన్‌మడ అడవులు మునిగిపోయాయి.
వందేళ్లలో విశాఖ సగం మునుగుతుంది..!
ఈ శతాబ్దం చివరి నాటికి అంటే.. 2100 నాటికి ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టం కనిష్టంగా 28 సెంటీమీటర్ల నుంచి గరిష్టంగా 98 సెంటీమీటర్ల వరకూ పెరగవచ్చునని ఐపీసీసీ అంచనా. గ్రీన్‌ల్యాండ్‌మంచుదుప్పటి పూర్తిగా కరిగిపోయినట్లయితే సముద్ర మట్టం ఏకంగా 7 మీటర్లు పెరుగుతుంది. అదే జరిగితే లండన్‌నగరం సముద్రంలో మునుగుతుంది. సముద్ర మట్టం ఒక మీటరు పెరిగితే భారత తీరంలో 13,973 చదరపు కిలోమీటర్ల భూభాగం సముద్రంలో మునిగిపోతుందని.. అదే నీటి మట్టం ఆరు మీటర్లు పెరిగితే 60,497 చదరపు కిలోమీటర్ల భూమి సముద్రం పాలవుతుందని ఇటీవల జర్నల్ ఆఫ్ త్రెటెన్డ్ టాక్సా మేగజీన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం చెప్తోంది.
ఆ అధ్యయనం ప్రకారం.. సముద్ర మట్టం ఒక మీటరు మేర పెరిగితే అంధ్రప్రదేశ్‌లోని గోదావరి కృష్ణా మడఅడవుల ప్రాంతం ముప్పావు భాగానికి పైగా మునిగిపోతుంది. పశ్చిమబెంగాల్లోని సుందరవనాలు సగానికి పైగా మునిగిపోతాయి. సముద్ర మట్టం ఆరు మీటర్లకు పైగా పెరిగితే గోదావరి కృష్ణా మడఅడవులు, సుందరవన్ మడఅడవులతో పాటు గుజరాత్‌లోని రాణ్ అఫ్ కచ్ చిత్తడి నేలలు సగానికి పైగా సముద్రగర్భంలో చేరతాయి. చిలికా సరస్సు, పులికాట్ సరస్సు సహా ఏడు రక్షిత ప్రాంతాలు సగానికి పైగా నీట మునుగుతాయి.
సముద్రమట్టం పెరుగుదల వల్ల 2050 నాటికి భారత దేశంలో 4 కోట్ల మంది జనాభాకు ముప్పుగా పరిణమిస్తుందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక గత ఏడాది హెచ్చరించింది. అందులోనూ ముంబై, కోల్‌కతా నగరాల ప్రజలకు ముంపు ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇక రాబోయే వందేళ్లలో దేశంలోని కోల్‌కతా, ముంబై, కొచ్చిన్, విశాఖపట్నం తదితర తీరప్రాంత నగరాలు సముద్ర ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని వాతావరణ, సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భారత తీర ప్రాంతాల్లోని పెద్ద నగరాల్లోకెల్లా కోల్‌కతా వద్ద సముద్రమట్టం ఎక్కువగానే కాదు.. వేగంగానూ పెరుగుతోంది. అక్కడ సముద్రమంట్టం పెరుగుదల 5.74 మిల్లీమీటర్లుగా నమోదైంది.
అందువల్ల మిగిలిన అన్ని నగరాలకంటే ఎక్కువగా కోల్‌కతా నగరం దెబ్బతింటుంది. ఆ తర్వాత దెబ్బతినే పెద్ద నగరాల్లో కొచ్చిన్ రెండో స్థానంలో ఉంది. అక్కడ సముద్రమట్టం ఏటా 1.75 మిల్లీమీటర్ల ఎత్తు పెరుగుతోంది. ఇక 1.25 మిల్లీమీటర్ల పెరుగుదలతో ముంబై మహా నగరం మూడో స్థానంలో ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తీర నగరం విశాఖపట్నంలో సముద్రమట్టం 1.09 మిల్లీమీటర్ల మేర పెరుగుతోంది. ఇది దేశంలో సముద్ర ముంపు ప్రమాదమున్న నాలుగో నగరం. మొత్తంమీద ప్రిసైస్ రీజనల్ క్లైమేట్ మోడల్ సూచిక ప్రకారం భారతదేశపు సముద్రమట్టాలు సంవత్సరానికి సగటున 1.30 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతున్నాయి. భూతాపం 2 డిగ్రీలు పెరిగినట్టయితే సముద్ర కెరటాలు 4.7 మీటర్లకు పెరిగే అవకాశం ఉంది. అదే భూతాపం 4 డిగ్రీలు పెరిగితే సముద్రం 9 మీటర్ల వరకు ఎగస్తుంది.
తూర్పు తీరానికే ముప్పు ఎక్కువ...
భారతదేశంపై సముద్ర మట్టం పెరుగుదల ప్రభావం గురించి ఇటీవల రాజ్యసభలో ఒక సభ్యుడు ప్రశ్న వేయగా.. కేంద్ర భూగోళశాస్త్రాల శాఖ మంత్రి జవాబు ఇచ్చారు. ఈ అంశంపై అనేక అధ్యయనాలు నిర్వహిస్తున్నామని.. సముద్ర మట్టం పెరుగుదల ప్రభావం పశ్చిమ తీరం కన్నా.. లోతట్టు ప్రాంతంలో ఉన్న తూర్పు తీరం మీద ఎక్కువగా ఉంటుందని, తీర ప్రాంతాలు వరద ముంపుకు గురవడం పెరుగుతుందని పేర్కొన్నారు. గత పాతికేళ్ల అధ్యయనం ప్రకారం భారత తీర ప్రాంతం కోతకు గురయ్యే స్వభావం 38.5 శాతంగా ఉందన్నారు. ఈ కోతను అరికట్టడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం సాంకేతిక సహకారం అందిస్తోందని వివరించారు.
ఉన్న మంచంతా కరిగిపోతే..?
మన భూగోళం మీద ప్రస్తుతం దాదాపు యాబై లక్షల ఘనపు మైళ్ల మంచు ఉంది. అది మొత్తం కరిగిపోతే సముద్రమట్టం 230 అడుగుల మేర పెరుగుతుంది. ఇందులో అత్యధిక మంచు అంటార్కిటికా, గ్రీన్‌ల్యాండ్‌లలోనే కేంద్రీకృతమై ఉంది. భారతదేశం కన్నా రెట్టింపు పరిమాణంలో విస్తరించి ఉన్న అంటార్కిటికా మొత్తాన్నీ ఒక మైలు మందం ఉన్న మంచు దుప్పటి కప్పి ఉంది. అది కరిగిపోతే సముద్ర మట్టం 200 అడుగులు పెరుగుతుంది.
అందులో చాలా మంచు ప్రస్తుతానికి స్థిరంగానే ఉన్నప్పటికీ.. పశ్చిమ అంటార్కిటికా మంచు దుప్పటి కూలిపోయే దశకు చేరుకుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది కరిగి సముద్రంలో కలిస్తే సముద్ర మట్టం 11 అడుగులు పెరుగుతుంది. ఇక గ్రీన్‌ల్యాండ్‌లో విస్తరించివున్న మంచు మొత్తం కరిగితే 23 అడుగుల మేర సముద్ర మట్టం పెరుగుతుంది. ఇది వేగంగా కరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. అంటార్కిటికా, గ్రీన్‌ల్యాండ్‌లు కాకుండా మిగతా మంచు అంతా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో గల గ్లేసియర్లు, మంచు కొండల్లో ఉంది. భూతాపం పెరుగుతున్న కొద్దీ ఆ మంచు కూడా కరగడం పెరుగుతోంది.
భూమి మీదున్న మంచు మొత్తం కరిగిపోతే చాలా దేశాల సముద్ర తీర ప్రాంతాలు మునిగిపోతాయి. వాటి రూపురేఖలు మారిపోతాయి. కొన్ని దేశాలకు దేశాలే.. అందులోనూ సముద్రాల మధ్య ఉండే ద్వీప దేశాలు నీటిపాలవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మంచంతా కరిగిపోయి సముద్ర మట్టం పెరిగిపోతే వివిధ ఖండాల రూపురేఖలు ఎలా మారతాయో అంచనాలతో మ్యాపులు తయారు చేశారు.
అందులో ఆసియా ఖండం మ్యాపు ఇది. దీనిప్రకారం.. చైనాలో అరవై కోట్ల మంది నివసించే ప్రాంతం నీట మునుగుతుంది. 16 కోట్ల మంది జనాభా గల బంగ్లాదేశ్ మొత్తం సముద్రగర్భంగా మారుతుంది. భారతదేశ తీర ప్రాంతాన్ని చాలా వరకూ సముద్రం కబళిస్తుంది. గుజరాత్ సగమే మిగులుతుంది. అది కూడా ఒక దీవిగా మారుతుంది. పశ్చిమ తీరం కన్నా తూర్పు తీరం ఎక్కువగా మునిగిపోతుంది. కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకూ చాలా ప్రాంతం అదృశ్యమవుతుంది. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు చాలా వరకూ నీటిపాలవుతాయి.
భూమి కూడా నిస్సారమవుతుంది..!
చివరి మంచు యుగం పది వేల ఏళ్ల కిందట ముగిసింది. అప్పుడు సముద్ర మట్టాలు పెరగడం మొదలైనపుడు భూమి మీద కేవలం 50 లక్షల మంది మనుషులు మాత్రమే ఉన్నారు. వాళ్లు సముద్ర తీరాల వెంట భారీ నగరాల్లో నివసించలేదు. కాబట్టి సముద్రమట్టాల పెరుగుదల ఇంతవరకూ మానవాళి మీద తీవ్ర ప్రతికూల ప్రభావమేమీ చూపలేదు. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సముద్ర తీరాల్లో భారీ నగరాలు నిర్మితమయ్యాయి.
కోట్లాది మంది తీర ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. సముద్రమట్టం నాలుగు అడుగులు పెరిగితే ఒక్క భారతదేశంలోనే 50 వేల మంది జీవితాలు ముంపుబారిన పడతాయి. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల తీర ప్రాంతాలు మునగడమే కాదు.. తుఫానులు భూభాగంలోకి మరింత దూరం చొచ్చుకురావడం, తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న సారవంతమైన పంటభూముల కిందకు ఉప్పునీరు చేరి అవి నిరుపయోగంగా మారడం వంటి పరినామాలూ సంభవిస్తాయి.
సముద్రమట్టం పెరగడానికి కారణాలేమిటి..?
కరుగుతున్న మంచుఖండాలు: భూగోళం ఉష్ణోగ్రత పెరగడాన్ని భూతాపం (గ్లోబల్‌వార్మింగ్)గా అభివర్ణిస్తున్నారు. భూగోళం ఉష్ణోగ్రత పారిశ్రామికీకరణ ముందు నాటికన్నా ఇప్పడు 1 డిగ్రీ సెల్సియస్‌పెరిగింది. దీనివల్ల ధృవప్రాంతాల్లోని మంచు ఖండాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న గ్లేసియర్లు కరుగుతూ ఆ నీరు సముద్రాల్లోకి వచ్చి చేరుతోంది.
వాతావరణంలో కర్బన శాతం పెరగడం ఇప్పటి రీతిలోనే కొనసాగితే.. ప్రస్తుతం 14.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్న సగటు ఉష్ణోగ్రత కొన్నేళ్లలో 27 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశం ఉందని.. దానివల్ల భూమి మీద ఉన్న మంచు మొత్తం పూర్తిగా కరిగిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే సముద్ర మట్టం 230 అడుగుల మేర పెరుగుతుంది. అయితే.. భూమి మీదున్న మంచంతా కరిగిపోవడానికి మరో ఐదు వేల సంవత్సరాల సమయం పడుతుందని ఇంకొందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
మరుగుతున్న సముద్రజలాలు..: మన ఇంట్లో పొయ్యి మీద కాచే నీళ్లు మరుగుతున్నప్పుడు అవి పైపైకి ఎగసిరావడం మనకు తెలుసు. అలాగే భూ వాతావరణం వేడెక్కడం వల్ల సముద్ర జలాలు కూడా వేడెక్కడం పెరుగుతోంది. వాతావరణ మార్పు వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలో 90 శాతాన్ని సముద్ర జలాలే స్వీకరిస్తున్నాయి. ఫలితంగా.. థర్మామీటర్‌లో పాదరసం వేడికి వ్యాకోచించినట్లుగానే సముద్ర జలాలు కూడా వేడికి వ్యాకోచిస్తున్నాయి. దానివల్ల కూడా ఆ జలాలు పైకి ఎగసివస్తున్నాయి. సముద్ర మట్టాల పెరుగుదలలో మూడో వంతు కారణం ఇదేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనినే ‘థర్మల్‌ఎక్స్‌పాన్షన్’ అని వ్యవహరిస్తున్నారు.
నివారించడానికి ఏం చేయాలి..?: ఇప్పటికే భారీ మొత్తంలో కర్బనవాయువులు వాతావరణంలో చేరిపోయాయి.. వాటిని తగ్గించడం దాదాపు అసాధ్యం. ప్రస్తుత పారిశ్రామిక రంగం పరిస్థితులను బట్టి ఈ వాయువులు ఇంకా పెరగడం ఖాయం. అంటే మున్ముందు మంచు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం అనివార్యం. కాకపోతే.. ఆ పెరుగుదల వేగాన్ని తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అందుకోసం ముఖ్యంగా భూతాపం పెరగకుండా చర్యలు చేపట్టాలి. వాతావరణంలో కర్బన వాయువుల విడుదలను తగ్గించాలి. అడవులు, చెట్లు విరివిగా పెంచాలి. పారిశ్రామిక వ్యర్థాల వల్ల సముద్రంలో సైటో ప్లాంగ్టన్ మొక్కలు చనిపోకుండా చూడాలి.
(సాక్షి నాలెడ్జ్‌సెంటర్)