పంజాబ్లో మళ్లీ కలకలం!
చండీగఢ్: పంజాబ్ లోని ఫిరోజ్పుర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల సంచారం మంగళవారం కలకలం సృష్టించింది. పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ బేసిన్లో ఇటీవలే పాకిస్థాన్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డ విషయం అందరికీ విదితమే. మళ్లీ కొన్ని రోజుల్లోనే ఆర్మీ దుస్తువుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు గుర్దాస్పుర్ లోని టిబ్రి ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫిరోజ్పుర్ పాకిస్థాన్కు సరిహద్దుగా ఉన్న జిల్లా. గుర్దాస్పుర్ నుంచి ఫిరోజ్పుర్ కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ఉగ్రవాద చర్యలు జరగకుండా అధికారులు అలర్ట్ అయ్యారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి చేరుకుని అనుమానాస్పద వ్యక్తులున్న భవనాన్ని చుట్టుముట్టారు.
ఫిరోజ్పుర్లో హైఅలర్ట్ పరిస్థితి నెలకొంది. ప్రత్యేక బలగాలను, అదనపు పోలీసు సిబ్బందిని అక్కడికి తరలించినట్లు సమాచారం. ఆర్మీ సిబ్బంది ప్రస్తుతం ఆ భవనం సమీప ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిరోజ్పుర్తో పాటు గుర్దాస్పుర్ జిల్లాలోనూ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. చెరకు పంట పొలాల్లో, సమీప గ్రామాల్లో పోలీసులు, ప్రత్యేక బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. గుర్దాస్పుర్ స్థానికుడు ఇద్దరు ఆర్మీ దుస్తువులు ధరించిన ఇద్దరిని చూసినట్లు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఆర్మీ దుస్తువుల్లో వచ్చి పఠాన్కోట్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనలో ఏడుగురు ఆర్మీ సిబ్బంది మృతిచెందడంతో పాటు 20 మంది గాయపడిన విషయం తెలిసిందే.