
రాజీనామాల్ని ఆమోదించాలని ప్రధానికి నలుగురు కేంద్ర మంత్రుల విన్నపం
తమ రాజీనామాల్ని ఆమోదించాల్సిందిగా సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్రధాని మన్మోహన్ సింగ్కు విజ్ఞప్తి చేశారు. తాము మంత్రులుగా కొనసాగలేమని, మంగళవారం నుంచి విధులకు హాజరుకాబోమని చెప్పారు. సోమవారం సాయంత్రం కేంద్ర మంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి ప్రధానితో సమావేశమయ్యారు. అనంతరం చిరంజీవి, పురంధేశ్వరి విలేకరులతో మాట్లాడారు.
పార్టీకి, ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్తో పదవులకు రాజీనామాలు చేసినట్టు వివరించారు. ఈ విషయంపై పునరాలోచించాల్సిందిగా ప్రధాని సూచించినట్టు చిరంజీవి చెప్పారు. సమస్యలపై కేంద్ర మంత్రుల బృందంతో మాట్లాడాల్సిందిగా చెప్పారని వెల్లడించారు. సీమాంధ్ర ప్రాంతంలో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల గురించి ప్రధానికి వివరించినట్టు చిరంజీవి తెలిపారు.