న్యూఢిల్లీ: మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల సన్నిహితుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మఖన్‌లాల్ ఫొతేదార్ (85) కన్నుమూశారు. మధుమేహం, అధిక రక్తపోటు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఫొతేదార్ గురువారం గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కశ్మీర్‌కు చెందిన ఫొతేదార్...తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రోత్సాహంతో 1950 తొలి నాళ్లలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇందిరా గాంధీ విశ్వాసం చూరగొని 1980లో ఆమెకు రాజకీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇందిర మృతి తరువాత ప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ కూడా ఫొతేదార్‌ను మూడేళ్లపాటు తన రాజకీయ కార్యదర్శిగా కొనసాగించారు. ఆ తరువాత తన కేబినెట్‌లో మంత్రి పదవి ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే అత్యున్నత విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో ఫొతేదార్ చాలాకాలం సభ్యునిగా కొనసాగారు. ఇప్పటికీ సీడబ్ల్యూసీకి శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్నారు. 1967–77 మధ్య కాలంలో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గమ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఫొతేదార్ మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు.