
జైపూర్: ఉత్తరభారతం వడగాడ్పులతో ఉడుకెత్తిపోతోంది. ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా నమోదైన 15 అత్యంత వేడి ప్రదేశాల్లో 10 ఉత్తర భారతంలోవే కావడం విశేషం. మిగతా ఐదు పాకిస్తాన్‌లో ఉన్నాయి. రాజస్థాన్‌లోని చురు (48.9 డిగ్రీలు) , శ్రీ గంగానగర్ (48.6 డిగ్రీలు)లు ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి . తర్వాత స్థానాల్లో పాకిస్తాన్‌లోని జకోబాబాద్(48 డిగ్రీలు), ఉత్తర ప్రదేశ్‌లోని బండా(47.4డిగ్రీలు), హరియాణాలోని నర్నాల్(47.2డిగ్రీలు) ఉన్నాయి. ఈఐ డొరాడో వెదర్ వెబ్‌సైట్ ఈ వివరాలు వెల్లడించింది. శనివారం నుంచి అగర్తలలో ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతున్నా ఈ ప్రాంతంలో ఎండలు మండిపోయాయి.
దేశంలోని పర్వత ప్రాంతాల్లో గత రెండు దశాబ్దాలుగా ఎండ ఎక్కువుండే రోజులు పెరుగుతున్నాయని, ముస్సోరీ లాంటి ప్రాంతంలో ఈ జూన్ 1న 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర చెప్పారు. పశ్చిమ దిశ నుంచి వస్తున్న పొడిగాలులు పాకిస్తాన్, రాజస్తాన్ ఎడారుల్లోని వేడిని గ్రహించడమే ప్రస్తుతం వేడిగాలుల ఉధృతికి కారణమని ఆయన చెప్పారు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రెండూ పెరుగుతుండటం వల్ల భూతలం బాగా వేడెక్కుతోందని,ఫలితంగా వేడిగాలులు ఎక్కువ కాలం కొనసాగుతున్నాయని, రెండు దశాబ్దాలుగా ఇలాంటి పరిస్థితిని గమనిస్తున్నామని మహాపాత్ర వివరించారు. 2010–2018 మధ్య కాలంలో దేశంలో వడగాడ్పుల కారణంగా 6,167 మంది చనిపోయారని, ఒక్క 2015లోనే 2,081 మంది వడగాడ్పులకు బలయ్యారు. మైదాన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే వడగాడ్పుగా పరిగణిస్తారు.
రెండు దశాబ్దాలుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు