ముంబై: 2014 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కేంద్ర వ్యవసాయ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్(73) వెల్లడించారు. అయితే, రాజ్యసభకు మాత్రం పోటీ చేస్తానన్నారు. రెండేళ్లకోసారి జరిగే ఎగువసభ ఎన్నికలు వచ్చే మార్చిలో జరగనున్న నేపథ్యంలో దానిలో పాల్గొని రాజ్యసభలో అడుగిడతానని చెప్పారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఎన్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవలి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంత వ్యతిరేక ఫలితాన్ని చవిచూసినప్పటికీ భవిష్యత్తులో పుంజుకుంటుందని పవార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఇందిర హయాంలో కూడా కాం గ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీచాయి. అయినప్పటికీ రెండేళ్ల వ్యవధిలోనే తిరిగి అధికారం చేజిక్కించుకుంది’ అని కార్యకర్తలకు చెప్పారు. ‘కాంగ్రెస్ విషయంలో ఎలాంటి బాధా అక్కరలేదు. నమ్మకంతో ప్రజల్లోకి వెళ్లండి. నిర్ణయాలు తీసుకునే నేతలకు ప్రజలెప్పుడూ పట్టగడతారు’ అని హితబోధ చేశారు.