రాజ్ నాథ్ ను షీలా దీక్షిత్ ఎందుకు కలిశారు?
న్యూఢిల్లీ: ప్రస్తుత కేరళ గవర్నర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. కేరళ గవర్నర్ కు ఉద్వాసన చెప్పవచ్చనే ఉహాగానాల మధ్య రాజ్ నాథ్ ను షీలా దీక్షిత్ కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిమధ్య సమావేశం పదిహేను నిమిషాలపాటు జరిగినట్టు తెలుస్తోంది.
కేరళ గవర్నర్ గా తన కొనసాగింపు అంశంపై రాజ్ నాథ్ తో షీలాదీక్షిత్ చర్చించినట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా వీరిమధ్య జరిగిన చర్చలు బయటకు రాలేదు. రాజ్ నాథ్ తో భేటి తర్వాత కేరళ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తారనే రూమర్లు ఊపందుకున్నాయి. ఎన్ డీఏ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత గవర్నర్ పదవికి రాజీనామా చేయడానికి షీలా నిరాకరించిన సంగతి తెలిసిందే.