తిరువనంతపురం: భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన.. కేరళ మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియన్ తన పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారంటూ ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసే ఉంటుంది. ఈ తరుణంలో రాజకీయ ఒత్తిళ్ల మేరకు.. బుధవారం సాయంత్రం కేబినెట్ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
వీలైనంత మంది సాధారణ ప్రజలను దోచుకునేలా మన రాజ్యాంగాన్ని రాశారని సాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పాతానమిట్ట జిల్లాలో జరిగిన సీపీఎం సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. చెరియన్ కామెంట్లపై రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెరియన్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి విజయన్ ను గవర్నర్ కోరారు.
మరోవైపు తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో చెరియన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను రాజ్యాంగాన్ని దూషించలేదని చెప్పారు. తనకు రాజ్యాంగంపై ఎంతో గౌరవం ఉందని అన్నారు. పాలనా వ్యవస్థ సరిగా లేదని, ఆ కోణంలోనే తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. అంతేకాదు, తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) ఈ వ్యవహారంపై అసెంబ్లీలో వాయిదా తీర్మానాన్ని స్వీకరించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ రూపకర్తలను చెరియన్ అవమానించారంటూ వ్యతిరేక నినాదాలు చేశాయి విపక్షాలు. ఈ క్రమంలో చర్చ జరగకుండానే.. స్పీకర్ ఎంబి రాజేష్ సభను వాయిదా వేశారు. ఈ చర్యపై నిరసన వ్యక్తం చేస్తూ.. స్పీకర్ కార్యాలయంలో విపక్షాలు నిరసన చేపట్టాయి.
చెరియన్ పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళతామని హెచ్చరించాయి. బీజేపీ లేఖ రాయడం, చివరకు సొంత పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు ఆయనే రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment