నటి నవనీత్ కౌర్ను దుర్భాషలాడిన శివసేన ఎంపీ
అమరావతి: శివసేన ఎంపీ ఆనంద రావు తనను దుర్భాషలాడారని దక్షిణాది సినీ నటి నవనీత్ కౌర్ ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎంపీతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నవనీత్ కౌర్ పలు తెలుగు, కన్నడ సినిమాల్లో నటించారు. మహారాష్ట్రకు చెందిన లెజిస్టేటర్ రవి రాణాను 2011లో వివాహం చేసుకున్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి ఎన్సీపీ తరపున లోక్సభకు పోటీ చేస్తున్నారు.
తనను కులం పేరుతో ధూషించడంతో పాటు వ్యక్తిగత విమర్శలు చేస్తూ బెదిరించారని కౌర్ ఫిర్యాదు చేసినట్టు ఓ అధికారి తెలిపారు. కాగా ఆనందరావు మాత్రం కౌర్ ఆరోపణల్ని ఖండించారు. ప్రజల్లో సానుభూతి పొందేందుకోసమే ఆమె తనపై తప్పుడు ఆరోపణల్ని చేస్తోందని విమర్శించారు. నవనీత్ వాదన మరోలా ఉంది. ఎన్సీపీ తనకు టికెట్ ఇవ్వనున్నట్టు తెలిసినప్పటి నుంచి రెండు నెలలుగా ఎంపీ అనుచరులు వేధిస్తున్నారని 27 ఏళ్ల నవనీత్ చెప్పారు. తాను నామినేషన్ వేస్తే చంపేస్తామని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక కొందరు తన ఫొటోలను అసభ్యకరరీతిలో సామజిక వెబ్సైట్లో పోస్ట్ చేశారని చెప్పారు.