సాక్షి, న్యూఢిల్లీ : ‘కొన్నేళ్లుగా మానసిక ఆందోళనతో బాధ పడుతూ అక్రమంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, వాటిని అధిక మొత్తంలో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని ప్రేమించిన పాపానికి నేడు ఓ యువతిని మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వెంటాడుతున్నాయి. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే’ అని బాలివుడ్ సినీ తార రియా చక్రవర్తిని మంగళవారం నాడు ‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో’ అరెస్ట్ చేయడం పట్ల ఆమె తరఫు న్యాయవాది సతీష్ మనెషిండే చేసిన వ్యాఖ్యలివి.
రియా చక్రవర్తిని ప్రేమిస్తూ ఆమెతో సన్నిహిత సంబంధాలు కలిగిన బాలీవుడ్ వర్ధమాన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన విషయం తెల్సిందే. ఆ కేసులో ఇంతకుముందే ఏడుగురు అనుమానితులను అరెస్ట్ చేయగా మంగళవారం నాడు రియాను అరెస్ట్ చేశారు. (చదవండి : ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి)
న్యాయవాది సతీష్ వాదన మేరకు రియా చక్రవర్తిని అన్యాయంగా అరెస్ట్ చేశారా ? ఏ చట్టం కింద ఆమెను అరెస్ట్ చేశారు ? ఆ చట్టం ఏం చెబుతోంది ? చట్టంలో లోపాలు ఏమైనా ఉన్నాయా ? అన్న అంశాలపై ఆమెను అరెస్ట్ చేయడం సబబా, కాదా ! అన్న విషయం ఆధారపడి ఉంది. ‘నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్’ కింద ఆమెను అరెస్ట్ చేశారు. దేశంలో మాదక ద్రవ్యాలు లేదా మానసిక ప్రేరణ కలిగించే ద్రవ్యాలను ఉత్పత్తి చేయడం, సరఫరా చేయడం, కొనుగోలు చేయడం, కలిగి ఉండడం, ఉపయోగించడాలను నిషేధిస్తూ 1985లో భారత పార్లమెంట్ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్‌పై అమెరికా యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం దీన్ని తెచ్చింది.
ఈ చట్టంతోపాటు మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రపంచ దేశాలతో చేసుకున్న పలు ఒప్పందాలు, ఒడంబడికలను పటిష్టంగా అమలు చేయడం కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ఓ చట్టం ద్వారా ‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో’ ఏర్పాటు చేసింది. ఎన్‌డీపీఎస్ చట్టం కింద అరెస్టయిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. నేరం తీవ్రతను బట్టి చట్టంలోని 31, ఏ సెక్షన్ కింద మరణ శిక్షను కూడా విధించేందుకు ఆస్కారం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2001లో చట్టాన్ని సవరించింది. ‘ఇండియన్ హార్మ్ రిడక్షన్ నెట్‌వర్క్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో మరణ శిక్షకు వ్యతిరేకంగా ముంబై హైకోర్టు తీర్పు చెప్పింది. మాదక ద్రవ్యాల కేసులో మరణ శిక్షను అమలు చేయాల్సిందేనంటూ పంజాబ్ ప్రభుత్వం 2018లో కేంద్రానికి సిఫార్సు చేసింది.(చదవండి : రియా చక్రవర్తి అరెస్ట్ )
ఎన్‌టీపీఎస్ చట్టంలో ఎంతో గందరగోళం
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోని ఈ చట్టంలో ఎంతో గందరగోళం ఉంది. ఈ చట్టంలో ‘అడిక్షన్ (బానిసవడం)’ అన్న పదంగానీ, దానికి నిర్వచనంగానీ లేదు. కాకపోతే వైద్య అవసరాల కోసం మాదక ద్రవ్యాలను ప్రభుత్వమే సరఫరా చేయవచ్చు అని ఉంది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారికి చికిత్స చేయడానికి లేదా వారి చేత వాటిని మాన్పించేందుకు మళ్లీ మాదక ద్రవ్యాలనే చికిత్సలో భాగంగా ఉపయోగించాల్సి వస్తుంది.
ఇక్కడ వైద్య అవసరాలకు ప్రభుత్వం మాదక ద్రవ్యాలను సరఫరా చేయవచ్చంటే ‘డి అడిక్షన్’ సెంటర్లకు ప్రభుత్వం వీటిని సరఫరా చేయవచ్చని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక్క డి అడిక్షన్ కేంద్రం కూడా లేదు. స్వచ్ఛంద సంస్థలు, మాదక ద్రవ్యాల ప్రభావం నుంచి బయట పడిన వ్యక్తులు, సమూహాలు వీటిని నడుపుతున్నారు. వీటికి ప్రభుత్వం మాదక ద్రవ్యాలను సరఫరా చేసే పద్ధతి కూడా అమలులో లేదు.
అమెరికా, కెనడా, నార్వే, బెల్జియం, నెదర్లాండ్స్ లాంటి దేశాలు మాదక ద్రవ్యాల నిర్మూలనా చట్టంలో భారీ సవరణలను తీసుకొచ్చి ‘అడిక్ట్స్ ట్రీట్‌మెంట్’కు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. అమెరికా ‘సస్టేన్ అబ్యూస్ అండ్ మెంటల్ హెల్త్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్’ పేరిట ఓ చట్టాన్నే తీసుకొచ్చింది. డ్రగ్ అడిక్షన్‌ను నైతిక పరమైన అంశంగా పరిగణించడం వల్లనే భారత ప్రభుత్వాలు ఈ చట్టంలో సవరణలు తీసుకొచ్చేందుకు ఇంతవరకు సాహసించలే కపోయాయి.
‘డ్రగ్ అడిక్షన్’ను ఇతర దేశాలు ఓ జబ్బుగా, అంటే ‘జీవమనోసామాజిక’ స్థితిగా గుర్తించడం వల్ల సవరణలు తీసుకొచ్చాయి. చట్టంలో గందరగోళం ఉండడం వల్ల భారత్‌లో డ్రగ్స్‌కు సంబంధించిన కేసుల్లో న్యాయవాదులు స్పష్టంగా వాదించలేకపోతున్నారు. న్యాయమూర్తులు స్పష్టమైన తీర్పులు చెప్పలేక పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రిచా నేరం చేశారా? అంటే నైతికంగా చేసినట్లు, ‘అడిక్షన్’ పరంగా చేయనట్లని అర్థం చేసుకోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment