ముంబై: దేశ వ్యాప్తంగా నిరసనలకు కారణమవుతున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)కి తాను మద్దతు ఇస్తున్నానని శివసేన ఎంపీ హేమంగ్ పాటిల్ అన్నారు. తాను బిజీగా ఉన్నందు వల్లే సీఏఏ, ఎన్నార్సీని సమర్థిస్తూ నిర్వహిస్తున్న ర్యాలీలకు హాజరకాలేక పోతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు తన నియోజకవర్గ ప్రజలకు ఆయన లేఖ రాశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభలో మద్దతు తెలిపిన శివసేన.. రాజ్యసభలో మాత్రం బిల్లును వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అదే విధంగా తాము సీఏఏకు వ్యతిరేకమని శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. హిందుత్వ నాయకుడు వీడీ సావర్కర్ ఆశయాలకు సీఏఏ వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హిందుత్వ పార్టీగా పేరున్న శివసేన తీరును పార్టీ మద్దతుదారులు విమర్శించారు. అదే విధంగా మరికొంత మంది సీఏఏ, ఎన్నార్సీని సమర్థిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో హింగోలీ ఎంపీ హేమంత్ పాటిల్ సీఏఏ, ఎన్నార్సీకి మద్దతు తెలుపుతూ రాసిన లేఖ చర్చనీయాంశమైంది. ‘ సమావేశాలకు హాజరు అవుతున్న కారణంగా ర్యాలీల్లో పాల్గొనలేకపోతున్నాను. ఇందుకు ఎంతగానో చింతిస్తున్నాను. అయితే నేను లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన విషయం అందరికీ తెలుసు. శివసేన ఎల్లప్పుడూ హిందుత్వ పార్టీగానే ఉంటుంది. సీఏఏ, ఎన్నార్సీని నేను ఎల్లప్పుడూ సమర్థిస్తానని మీకు ఈ లేఖ రాస్తున్నాను అని పాటిల్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు మాత్రం ఈ లేఖను పంపించకపోవడంతో.. హేమంత్ పాటిల్.. తన క్యాడర్‌ను సంతోషపరచడానికే ఇలా చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అధిష్టానంతో నిజంగా విభేదించే సత్తా లేక.. తన కార్యకర్తలు బీజేపీలో చేరతారనే భయంతోనే లేఖ రాశారంటూ పలువురు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment