
కావాలనే అవమానించారు
బీజేపీ హామీ ఇస్తేనే మోడీ సభలకు వెళ్తానని స్పష్టీకరణ
సాక్షి, ముంబై: బీజేపీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ లభించేంత వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనబోనని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. ఉద్దేశపూర్వకంగానే షోలాపూర్ సభలో తనను అవమానించారని స్పష్టం చేశారు. షోలాపూర్‌లో మోడీ సభ సందర్భంగా కొందరు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. చవాన్ ప్రసంగం ఆపాలని, మోడీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. దీంతో సీఎం ప్రసంగాన్ని మధ్యలోనే ఆపాల్సి వచ్చింది.
ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి చెందినట్టు సీఎం చెప్పారు. తనతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు వ్యతిరేక ంగా బీజేపీ కార్యకర్తలు ఇలాగే వ్యవహరించారని విమర్శించారు. అందుకే తాము మోడీ కార్యక్రమాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇక నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాబోవని హామీ లభిస్తే ఆయన కార్యక్రమాలకు హాజరవుతానని పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. పుణే మెట్రో లేదా ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై తాను అసంతృప్తి చెందలేదని సీఎం వివరణ ఇచ్చారు.
మోడీ ఎలా బాధ్యుడు ?
ప్రధాని సభల్లో బీజేపీయేతర ముఖ్యమంత్రుల ప్రసంగాలను అభిమానులు అడ్డుకుంటే దానికి నరేంద్ర మోడీ ఎలా బాధ్యుడని శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు. షోలాపూర్ సభలో సీఎం ప్రసంగాన్ని అడ్డుకోవడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రసంగాన్ని అడ్డుకున్న వాళ్లు గుజరాత్ నుంచో ఢిల్లీ నుంచో రాలేదు. వీళ్లంతా మహారాష్ట్ర వాళ్లే. హర్యానా, జార్ఖండ్‌లోనూ అక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఇలాగే పరాభవం జరిగింది’ అని శివసేన అధికార పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో ఉద్ధవ్ పేర్కొన్నారు. మోడీ భారీ ప్రజామద్దతుతో గెలిచారని, అందుకే ఎక్కడైనా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.
మూడు రోజుల క్రితం నాగపూర్‌లో జరిగిన మోడీ సభకు చవాన్ గైర్హాజరు కావడం దురదృష్టకరమని సామ్నా సంపాదకీయం వ్యాఖ్యానించింది. అక్కడి సభలో ప్రజల నినాదాలు గమనిస్తే కాంగ్రెస్‌పై వారికి ఎంత విముఖత ఉందో స్పష్టంగా తెలుస్తోందని విశ్లేషించింది. యూపీఏ హయాంలో అవకాశం దొరికినప్పుడల్లా మోడీని అవమానించిన కాంగ్రెస్ ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటోందని సామ్నా వ్యాఖ్యానించింది. ఢిల్లీలో ముఖ్యమంత్రుల సదస్సులు జరిగినప్పుడు మోడీని సవతి సోదరుడి మాదిరిగా చూసే వారని ఉద్ధవ్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ నాగపూర్‌లో మోడీ సభకు గైర్హాజరు కావాలని సీఎం చవాన్ నిర్ణయం సరైందేనని పేర్కొంది.
ప్రధాని సభల్లో ముఖ్యమంత్రులతో వ్యవహ రించే విధానం సరిగ్గా లేనందునే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఎంపీసీసీ స్పష్టం చేసింది. షోలాపూర్ సభలో చవాన్ ప్రసంగిస్తున్నప్పుడు బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఎంపీసీసీ అధ్య క్షుడు మాణిక్‌రావు ఠాక్రే ఆరోపించారు. ఇంత జరుగుతున్నా, ప్రధాని మోడీ మౌనంగానే ఉన్నా రని విమర్శించారు.