రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న హార్దిక్ పటేల్ తరపున కాంగ్రేస్ నాయకుడు, ప్రముఖ లాయర్ కపిల్ సిబాల్ సుప్రికోర్టులో వాదనలు విన్పించనున్నారు. పటేల్ వర్గానికి రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఓ సభలో హార్దిక్ పటేల్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లకై పిరికివాళ్లలా ఆత్మహత్య చేసుకోవడానికి బదులుగా అవసరమైతే పోలీసులను చంపాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలకు గాను హార్దిక్ పటేల్పై రాజద్రోహం కేసు నమోదైంది. అంతేగాక ఇండియా, దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ సందర్భంగా చేపట్టిన నిరసనలో.. తలకిందులుగా ప్రదర్శించి జాతీయ జెండాను అవమానించాడనే కేసు కూడా హార్దిక్ పటేల్పై నమోదైంది.
మంగళవారం హార్దిక్ పటేల్కు విధించిన రిమాండ్ గడువు తీరడంతో ఆయన్ని అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు మరో కేసులో విచారణకై సూరత్ పోలీసులకు అప్పగించారు. హార్థిక్ పటేల్కు అహ్మదాబాద్ కోర్టు మూడురోజులు రిమాండ్ విధించగా అతన్ని విచారించలేదని లాయర్ మంగూకియా తెలిపారు. హార్దిక్ తండ్రి ఈ కేసును సుప్రీం కోర్టులో సవాల్ చేశారనీ, దీనిపై కపిల్ సిబాల్ వాదనలు విన్పించనున్నారని ఆయన తెలిపారు.