రాజ్యాంగానికి విరుద్ధం ఏకకాలంలో ఎన్నికలు
న్యూఢిల్లీ: భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో దేశంలోని పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగేవి. అలాగే ఇప్పుడు కూడా పార్లమెంట్‌తోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ఈ ఆలోచనను ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఇలా ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించడం వల్ల కాలంతోపాటు ఎంతో ఖర్చు కలసి వస్తుందని ఆయన ఓ రెండు ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయం వ్తక్తీకరణకు అక్టోబర్ 15 తేదీ వరకు గడువు కూడా నిర్దేశించారు.
నరేంద్ర మోదీకి మాత్రమే ఈ ఆలోచన రాలేదు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అద్వానీ మొదటి నుంచి ఇదే సూచన చేస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇటీవల గురుపూజోత్సవం సందర్భంగా ఓ పాఠశాలలో మాట్లాడుతూ ఈ సూచనకే ఓటేశారు. ఖర్చు కలసివస్తోందంటే ఎవరైనా ‘అవునుకదా!’ అని అనుకోవచ్చు. భారత సమాఖ్య రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీసే ప్రమాదకరమైన ఆలోచన లేదా సూచన ఇది.
తొలుత, పార్లమెంట్‌తోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలంటే కొన్ని రాష్ట్రాల ఎన్నికలను ముందుకు జరపాలి, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వెనక్కి జరపాలి. అలా చేయడం వల్లన రాజ్యాంగం నిర్దేశిస్తున్న ఐదేళ్ల అసెంబ్లీ కాల పరిమితి కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతుంది, కొన్ని రాష్ట్రాల్లో తగ్గుతుంది. అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. అయినా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించినట్లయితే అది ఎల్లప్పుడు కొనసాగుతుందన్న గ్యారెంటీ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలపై అవిశ్వాస తీర్మానాల కారణంగా, రాష్ట్రపతి పాలన కారణంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇంతకాలం మారుతూ వచ్చాయి.
ఇకముందూ మారుతాయి. పార్లమెంట్ లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వంపైనా అవిశ్వాస తీర్మానం నెగ్గిన సమయంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే ఎన్నికలు అనివార్యమవుతాయి. ఈ పరిస్థితికి విరుగుడుగా ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని సూచించినప్పుడు మాత్రమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని దివంగత బీజీపీ నాయకుడు భైరాన్‌సింగ్ షెకావత్ సూచించారు. ఈ సూచనను అమలు చేసినట్లయితే ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం ఉన్న ప్రజలకు దాన్ని పడగొట్టే అధికారం ఉందన్న రాజ్యాంగ నిబంధనను కాలరాసినట్లు అవుతుంది.
ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించినట్లయితే కేంద్ర సమస్యలు, విధానాలే ఎక్కువ ప్రచారంలోకి వస్తాయి. రాష్ట్ర సమస్యలను అంత ప్రాధాన్యత లభించదు. ఇది కూడా రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. అంతేకాకుండా కేంద్రంలో గెలిచే పార్టీకే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. 1999 నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్‌తో పాటు జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా 77 శాతం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్రంలో విజయం సాధించిన పార్టీయే విజయం సాధించింది. ఈ కారణంగా ప్రాంతీయ పార్టీలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు కార్పొరేట్ ఫండింగ్ ఎక్కువగా ఉంటుందన్న విషయం అందరికి తెల్సిందే. అందువల్ల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కూడా డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటుందని సులభంగా ఊహించవచ్చు. ఎన్నికల ఖర్చు కలసిరావడంకన్నా దేశ సమాఖ్య రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించుకోవడమే ముఖ్యం. సమాఖ్య స్ఫూర్తికి గుర్తుగానే కేంద్రంలోని ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అనడానికి బదులుగా యూనియన్ గవర్నమెంట్ అని వ్యవహరిస్తారు. యాభై రాష్ట్రాలున్న అమెరికాలో కూడా వేర్వేరుగానే రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి.