దైవ దర్శనానికి వెళ్లిన ప్రముఖ వయోలినిస్ట్, మ్యుజీషియన్ బాలభాస్కర్ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన కుమార్తె తేజస్వి (2) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. బాలభాస్కర్, ఆయన భార్య లక్ష్మితో సహా డ్రైవర్ అర్జున్ తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే బాలభాస్కర్ దంపతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
తిరువనంతపురం శివారు ప్రాంతం పల్లిప్పురమ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిస్సూర్‌లో ఓ దేవాలయాన్ని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
కాగా సంగీత దర్శకుడిగా కరియర్‌ను ప్రారంభించిన బాలభాస్కర్ స్టేజీ షోలతో గాయకుడిగా, వయోలినిస్ట్‌గా మరింత పాపులర్ అయ్యారు. 12 ఏళ్ళ వయస్సులో తన సంగీత వృత్తిని ప్రారంభించిన మలయాళ చిత్రపరిశ్రమలో అతి చిన్నవయసున్న సంగీత దర్శకుడిగా ఖ్యాతి గడించారు. ‘మాంగల్య పల్ల’కు అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా మారిన బాలభాస్కర్.. ఆ తరువాత ‘మోక్షం’, ‘కన్నదిక్కదవతు’ అనే చిత్రాలకు సంగీతం అందించారు. వయోలినిస్ట్‌గా ఉస్తాద్ జాఖీర్ హుస్సేన్, శివమణి, లూయిస్ బాంక్స్, హరిహరన్, ఫాజల్ ఖురేషి తదితర ప్రముఖులతో కలిసి పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment